ఇంటింటికీ సత్యసాయి వైద్యసేవలు

21 Aug, 2017 02:21 IST|Sakshi
ఇంటింటికీ సత్యసాయి వైద్యసేవలు

సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షులు నిమీష్‌పాండే
ముగిసిన జాతీయ వైద్య సమ్మేళనం


పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి సత్యసాయి వైద్య సేవలను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు వీలైతే ఇంటింటికీ తీసుకెళ్తామని సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షులు నిమీష్‌పాండే పేర్కొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో రెండు రోజులుగా జరుగుతున్న సత్యసాయి జాతీయ వైద్య సమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యోనారాయణో హరి అన్న బాబా సూచనలతో వేలాది మంది వైద్యులు సేవ చేయడానికి సత్యసాయి సంస్థల్లో చేరుతున్నారని వారి అభీష్టం మేరకు వైద్య సేవలను గ్రామీణుల చెంతకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

ఈ సమ్మేళనం వైద్యులు, వైద్య సిబ్బంది, హెల్త్‌కేర్‌ మిషన్‌ సభ్యులకు మంచి వేదికైందన్నారు. ఇలాంటి వేదికల ద్వారా అన్యోన్యత ఏర్పడి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దనుందన్నారు. అనంతరం కాంచీపురంలోని అన్నా క్యాన్సర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ రచించిన అవతార్‌ అనే పుస్తకాన్ని ట్రస్ట్‌ సభ్యులు శ్రీనివాస్‌రావు, ఆర్‌జే రత్నాకర్, వైద్యబృందం సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. అలాగే పేదలకు అత్యుత్తమ సేవలు అందించిన సుమారు 40 మంది వైద్యులకు సత్యసాయి ధన్వంతరి సేవా అవార్డులు అందించారు. కార్యక్రమంలో సుమారు 1500 మంది వైద్యబృందం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పి.వేణుగోపాల్, పీకే దాస్‌ తదితర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు