అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...

3 Jun, 2017 23:46 IST|Sakshi
అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోరుకున్న కొలువు కావాలనుకుంటున్నారా.. అర్హత లేకున్నా ఫర్లేదు, కావల్సిందల్లా...దండిగా సొమ్ములు...సిఫార్సులే. ఇదంతా దేవాదాయశాఖలో మాత్రమే సాధ్యమనడానికి ఉదాహరణ జిల్లాలోని పలు ఆలయాల్లో అర్హతలేని ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టడమే. అర్హతలుండీ అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేని వారిని ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితం చేయడం అవినీతికి దర్పణం పడుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పడి ఒకేచోట నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జీలుగా కొనసాగిస్తున్న వైనం​దేవాదాయ శాఖలో సాగుతోంది. ఎవరైనా ఏదైనా అంటే పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని సమాధానం చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు.
డీసీ పోస్టులో జూనియర్‌...
దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్‌ పోస్టు ఇన్‌చార్జి ఏలుబడిలో నడుస్తోంది. రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ కమిషనర్‌ డీఎల్‌వీ రమేష్‌బాబు గడచిన ఎనిమిది నెలలుగా డీసీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకంలో 1986లో దేవాదాయశాఖలోకి వచ్చిన రమేష్‌బాబు జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, సూపరిండెంట్‌గా పదోన్నతిపొంది అనంతరం 2009లో అడ్‌హాక్‌ ఏసీ అయ్యారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం అడహాక్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో కాకినాడ డీసీగా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాది తప్ప మిగిలిన సర్వీసంతా జిల్లాలోనే. జిల్లాలో పలువురు సీనియర్‌ అధికారులున్నా రమేష్‌బాబుకు డీసీ ఇన్‌చార్జిగా కట్టబెట్టడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రమేష్‌బాబు కంటే సీనియర్లయిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఈవో దేవుళ్లు,  పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం ఆర్‌ పుష్పనాథం, అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్‌ ఈరంగి జగన్నాథం. తలుపులమ్మ లోవ ఈవో చంద్రశేఖర్, అప్పనపల్లి బాలాబాలజీ స్వామి దేవస్థానం ఈవో బాబూరావులు రమేష్‌బాబుకంటే సీనియర్లు. వీరంతా పూర్తి స్థాయి అసిస్టెంట్‌ కమిషనర్‌లే. అయినా వీరందరినీ పక్కనబెట్టి అడహాక్‌ ఏసీగా ఉన్న రమేష్‌బాబును గడచిన ఎనిమిది నెలలుగా కాకినాడ డీసీగా కొనసాగించడంలో ఔచిత్యమేమిటో ఆ దేవుడికే తెలియాలి. డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) నిర్వహిస్తే పదోన్నతుల్లో పైన పేర్కొన్న ముగ్గురు డీసీ జాబితాలో ముందుంటారు...అయినా అడ్‌హాక్‌ ఏసీగా ఉన్న రమేష్‌బాబుకే పదోన్నతి పట్టం కడుతోండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రేడ్‌ వన్‌ అధికారులు కూడా ఆయన తరువాతే... 
  ఏసీలు, డీసీలే కాదు గ్రేడ్‌–1 అధికారులు కూడా అన్యాయమైపోతున్నారు. పళ్లంరాజు గ్రేడ్‌–1 అధికారి. ఆయన అర్హతకు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్‌ కలిగిన వారిని నియమించే 6బి పరిధిలోని కాండ్రకోట నూకాలమ్మ ఆలయానికి ఈవోగా కొనసాగిస్తున్నారు. మరో గ్రేడ్‌–1 అధికారి అల్లు భవాని కాకినాడ జగన్నాథపురం గ్రూపు దేవాలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈవో పోస్టు 6–సీ అంటే గ్రేడ్‌–3 అధికారి పనిచేసే పోస్టింగ్‌ అది. మరో అధికారిణి ఆర్‌.చందన. ఈమె కూడా పదేళ్ల సీనియర్‌ గ్రేడ్‌–1 అధికారి. ఆమెను కూడా 6సీ అంటే గ్రేడ్‌3 రాజమహేంద్రవరం సత్యనారాయణస్వామి ఆలయం ఈవోగా పని చేస్తున్నారు. గ్రేడ్‌1అధికారైన పితాని సత్యనారాయణ (తారకేశ్వరరావు)ను 6బి పరిధిలోని రాజమహేంద్రవరం చందాసత్రం ఈఓగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్‌.శ్రీనివాస్, సత్యవాణి వీరు కూడా గ్రేడ్‌1 అధికారులే. వీరిద్దరూ రాజానగరం సత్రం, రాజమహేంద్రవరం నేషనల్‌ సీనియర్‌ బేసిక్‌ స్కూల్‌(ఎన్‌ఎస్‌బిఎస్‌) ఈవోలుగా పనిచేస్తున్నారు. 6–బి, 6–సీ గ్రేడ్‌లు కలిగిన ఈ రెండు పోస్టుల్లో గ్రేడ్‌–1 అధికారులు పనిచేస్తున్నారు. వీరంతా ఆ శాఖలో సీనియర్‌ గ్రేడ్‌–1 అధికారులే అయినా ఉన్నతాధికారులు ఎవరికీ వీరు కనిపించకపోవడం గమనార్హం.
ఇంత జరుగుతున్నా పైవారికి తెలియదా...?
అర్హతలు లేని వారెందరో జిల్లాలో అందలాలెక్కి కూర్చున్నా ఆ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్‌కు తెలియకుండా ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి కలిగిన ఆలయాల్లో అంతకు తక్కువ స్థాయి కలిగిన వారు పైరవీలతో పాతుకుపోయారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో వాసంశెట్టి ఉమామహేశ్వరరావు కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చారిటీస్, అమలాపురం వెంకటేశ్వరస్వామి ఈఓ వీవీవీఎస్‌ మూర్తి మందపల్లి, గ్రేడ్‌–1 స్థాయి కలిగిన ఈఓలు ఉండాల్సిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి, అయినవిల్లి సిద్దివినాయక ఆలయాల్లో అంతకంటే తక్కువ గ్రేడ్‌–2 క్యాడర్‌  కలిగిన రమణమూర్తి, సత్యనారాయణరాజు ఈవోలుగా పనిచేస్తున్నారు. అయినవిల్లి, వాడపల్లి రెండు దేవస్థానాల్లో పెరిగిన ఆదాయంతో ఏసీ క్యాడర్‌కు వచ్చేశాయి. అధికారికంగా ఉత్తర్వులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటువంటి ఈ రెండు దేవస్థానాలు గ్రేడ్‌–2 అధికారులనే కొనసాగిస్తున్నారు. ఇందులో తాజా బదిలీల్లో వాడపల్లి దేవస్థానానికి వచ్చేందుకు గ్రేడ్‌–1 రెగ్యులర్‌ ఇఒలు విశ్వప్రయత్నం చేసినా ఇన్‌ఛార్జిగా కొనసాగుతోన్న గ్రేడ్‌–2  వానపల్లి ఇఒ రమణమూర్తి తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఆ ఆలయానికి పని చేయగలిగే అర్హతలున్న గ్రేడ్‌–1 ఈవోలను కాదని ఇన్‌ఛార్జిని కొనసాగించడంలో మర్మమేమిటో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ విషయాన్ని గత నెల 25న ‘వాడపల్లి వెంకన్నా నీ వాడిని నేనయ్యా’మ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయ ఈవో గ్రేడ్‌–2 కేడర్‌. ఆ ఆలయం చూస్తే గ్రేడ్‌–1 అంతకంటే ఎక్కువగా అసిస్టెంట్‌ కమిషనర్‌ను కూడా నియమించవచ్చు. అటువంటిది ఐదేళ్లయినా  గ్రేడ్‌–2 ఈవోను రెగ్యులర్‌ చార్జితో ఇన్‌ఛార్జిగా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రేడ్‌–1 ఈవోలు బీజేపీ నేతల దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారని తెలిసింది. దేవాదాయ శాఖలోని కమ్యునికేషన్‌ స్కిల్స్‌లో ఆరితేరిపోవడమే వారికి శ్రీరామ రక్షగా ఉందంటున్నారు.
సరైన విధానం లేకనే...
అయినవిల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మురమళ్ల వీరేశస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి...ఈ ఆలయాలన్ని ప్రస్తుతం గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 ఈవోలు పనిచేస్తున్నారు. ఈ ఆలయాలన్నీ ఏసీ క్యాడర్‌ స్థాయికి ఎప్పుడో చేరిపోయాయంటున్నారు. వాటికి తగ్గ క్యాడర్‌ను ప్రకటించి ఆ తరహా ఈవోలను నియమించాల్సి ఉంది. ఇవి జరగనంత వరకు ఈ సిఫార్సు వ్యవహారాలు ఆ శాఖలో మామూలేనంటున్నారు.
మరిన్ని వార్తలు