ఆలయాల భూములివ్వం

9 Jun, 2017 17:13 IST|Sakshi
ఆలయాల భూములివ్వం

అరసవిల్లి (శ్రీకాకుళం) : ఆలయాల నిర్వహణ, అభివృధ్ది కోసం భక్తులు ఎంతో ఉదారంగా ఎకరాల కొలది విలువైన భూములను అప్పట్లో దానం చేసారని, ఆ ఆలయ భూములను రాష్ట్రంలో అల్పాదాయ పేదలకు ఇవ్వడం కుదరదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేసారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో వేలాది ఎకరాల దేవాలయాల భూములు దాతలిచ్చినవని, ఇవి ప్రభుత్వ భూములు కావని తేల్చిచెప్పారు. ఆలయ భూములను భూమి లేని, ఇళ్లు లేని పేదలకు ఇచ్చేందుకు వీలు లేదని, దీనికి అనుగుణంగానే ఆ భూమలు అన్యాక్రాంతం,ఆక్రమణలు జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కన్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది దివ్య దర్శనం పేరిట 1.30 లక్షల మందికి ఉచితంగా తిరుపతి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శించేలా యాత్రలు నిర్వహించామని, దీనికి అనూహ్య స్పందన లభించిందన్నారు.

వచ్చే ఏడాది ఈయాత్ర భక్తుల సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో టిటిడి, దేవాదాయ శాఖ సంయుక్తంగా 500 దేవాలయాల నిర్మాణాలకు సంకల్పించామని త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలో అన్నవరం, సింహాచలం, విజయవాడ, ద్వారకాతిరుమల తదితర దేవాలయాల్లో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసామని, వీటిలో మిగులు విద్యుత్‌ను చిన్న దేవాలయాలకు సరఫరా చేస్తామని వివరించారు.

దేవాలయాల్లో రోజు వారీ ఆదాయం, లెక్కలు, పూజలు ఆర్జిత పేవలు అన్నదానం తదితర వివరాలన్నీ వచ్చే నెల (జూలై) నుంచి ఆన్‌లైన్‌లో భక్తులందరికి కన్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో ప్రతి విషయం భక్తులకు తెలిసేలా పారదర్శకంగా ఉండాలని ఈ మేరకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని తెలియజేసారు. అంతకుముందు ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తర్వాత ఆలయ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి అభివృద్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మపై పత్రికల్లో వచ్చిన పలు కథనాలపై ఆయన స్పందిస్తూ, పూర్తి విచారణ చేయించి తగు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇవో వి.శ్యామలాదేవి, ఆలయ అర్చకుడు ఇప్పిలి నగేష్‌ శర్మ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు