ఖాళీశాలలు

20 Jul, 2016 22:34 IST|Sakshi
ఖాళీశాలలు
  • ఇంజనీరింగ్‌ సీట్ల తీరు
  • మిగులుతో యాజమాన్యాల దిగులు
  • మొదటి విడత జాబితాలో 46 శాతమే భర్తీ
  • రెండో విడతపైనే ఆశలు
  • కళాశాలల నిర్వహణపై మల్లగుల్లాలు
  • ఫీజుల కుదింపుతో విద్యార్థుల వెనుకంజ
  • సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇంజనీరింగ్‌ కళాశాలలు యాజమాన్యానికి గుదిబండలవుతున్నాయి. ఫీజుల భారంతో పాటు, కోర్సు పూరై్తనా ఉపాధి అవకాశాలు దొరక్కపోవటంతో విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్యాభ్యాసానికి ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్‌ స్థానంలో సాధారణ డిగ్రీ కోర్సులో చేరడానికే శ్రద్ధ చూపుతున్నారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు ఇప్పుడు చేరే వారే లేక  వెలవెల బోతున్నాయి.

    అన్ని వసతులున్నా.. అనువైన ఫ్యాకల్టీ ఉన్నట్లు జేఎన్‌టీయూ అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చి అప్లియేషన్‌ ఇచ్చినా.. కళాశాలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో రూ.కోట్లు చెల్లించి కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో తొలి విడత జాబితాలో 80 శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈసారి 46 శాతం మాత్రమే సీట్లు నిండటం గమనార్హం.

    సగం సీట్లు మాత్రమే భర్తీ
    ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్‌టీయూ అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో జిల్లాలో మొత్తం 31 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 8,500కు పైగా సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి జాబితాలో 4,350 సీట్లే భర్తీ అయినట్లు తెలిసింది.

    ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లోనే ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. వీటిల్లో ప్రధానంగా డిమాండ్‌ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కావడం లేదు.

    ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ
    ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంటర్‌ ఉత్తీర్ణులై.. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించే సత్తా ఉన్నా ప్రభుత్వం ఈసారి ఫీజులు కుదించడంతో పేద విద్యార్థులు ఇంజనీరింగ్‌ చదివేందుకు వెనుకంజ వేస్తున్నారు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు భారం కావద్దనే ఆలోచనతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంసెట్‌లో అర్హత సాధించిన ప్రతీ విద్యార్థికి ఇంజనీరింగ్‌ చదువు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లించేవారు.

    కానీ ప్రస్తుత ప్రభుత్వం 10 వేల ర్యాంకులోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రమే ఇస్తామని ప్రకటిండంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విద్యా భారంగా మారింది. ఏటా కళాశాల ఫీజు కేవలం రూ. 35వేలు మాత్రమే చెల్లిస్తుందని, మిగిలిన డబ్బులు విద్యార్థులే చెల్లించాలని ప్రకటించారు.

    దీంతో జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజు రూ. 60 వేల నుండి రూ.40 వేల లోపు ఉండగా.. ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్‌టీయూ, బస్సు ఫీజు, ఇతర ఫీజుల కోసం అప్పులు చేసి చదవడం కన్నా డిగ్రీలో చేరడమే మేలనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు.

మరిన్ని వార్తలు