ఇంజనీరింగ్‌ విద్యార్థిపై పోలీసుల దాడి

12 Aug, 2016 00:40 IST|Sakshi
  • కిట్స్‌ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
  • అధ్యాపకుడే దగ్గర ఉండి కొట్టించాడని బాధితుడి ఆరోపణ
  • డైరెక్టర్‌ కారు ధ్వంసం
  • కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని  డైరెక్టర్‌ హమీ 
  • భీమారం : కిట్స్‌ కళాశాల విద్యార్థిని పోలీసులు చితకబాదారు. దీంతో కళాశాల తరగతులు బహిష్కరించిన తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల దాడికి కారణమైన ఓ అధ్యాపకుడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కిట్స్‌ కళాశాలలో ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బయటి వ్యక్తులను లోపలికి రాకుండా నిరోధించడానికి కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ ప్రధాన రహదారి వద్ద ఇద్దరు అధ్యాపకులను నియమించారు. కళాశాల విద్యార్థులు లోపలికి వచ్చేటప్పుడు విధిగా స్టూడెంట్‌ ఐడీ కార్డు తప్పక ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉద యం గేట్‌ వద్ద అధ్యాపకుడు రఘురామశర్మరను నియమించారు. కళాశాలలో సీఈసీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న నిఖిల్‌ ఉదయం కళాశాల ప్రధాన ద్వా రం వద్దకు వచ్చాడు. కళాశాల జారీ చేసిన గుర్తింపుకార్డు అతడి వద్ద కనిపించకపోవడంతో అతడిని అక్కడే నిలిపివేశాడు. ఈ క్రమంలోనే సదరు అధ్యాపకుడు నిఖిల్‌ను కొట్టాడని విద్యార్థులు ఆరోపించారు. అదే సమయం లో అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా ఆ అధ్యాపకుడు వారితో కూడా కొట్టించాడని బాధితుడు  నిఖిల్‌ పేర్కొన్నాడు. అంతకు ముందు రోహన్‌ అనే విద్యార్థిని కూడా సదరు అధ్యాపకుడు కొట్టినట్లు విద్యార్థులు ఆరోపించారు. 
    డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన..
    విషయం తెలుసుకున్న విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. కళాశాల ఆవరణలోకి పోలీసులను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. పోలీసులతో కొట్టించిన అధ్యాపకుడిని కళాశాల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పార్క్‌ చేసిన డైరెక్టర్‌ కారును విద్యార్థులు ధ్వం సం చేశారు. సంఘటనపై కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకుంటామని, ఒకవేళ పోలీసులు లాఠీతో కొట్టినట్లయితే పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.  
మరిన్ని వార్తలు