ఇంగ్లిషు భయాన్ని పారద్రోలాలి

22 Sep, 2016 23:23 IST|Sakshi
వివరాలు అడుగుతున్న డీఈఓ రాజేష్‌

నేలకొండపల్లి :  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిషు భయాన్ని ప్రారద్రోలేలా బోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్‌ సూచించారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మోనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో 965 మంది ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ బోధనపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 811 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యావాలంటీర్లు ద్వారా బోధన చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని చెన్నారం హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టి వైరాలో కాలేజీ నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 28న జిల్లాలో రాష్ట్ర బృందం ప్రవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తనీఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేలకొండపల్లి మండ లంలో కొత్తకొత్తూరు ప్రవేట్‌ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని, దీనిపై మండల విద్యాశాఖాధికారిని విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవేట్‌కు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో ఎంఈఓ పురుషోత్తమరావు, డీఆర్‌పీలు రామనాధం, అనితరాణి, ఆశాలత, పెద్ది జగన్నాధం, పంబ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు