వృత్తి ఇంగ్లిష్‌ బోధన.. ప్రవృత్తి తెలుగులో రచన..

11 May, 2017 23:02 IST|Sakshi
వృత్తి ఇంగ్లిష్‌ బోధన.. ప్రవృత్తి తెలుగులో రచన..
-‘ఆయ్‌..మేం గోదారోళ్లమండి’ కవి నూజిళ్ల
-ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం సిటీ) : ఈ మధ్య వాట్సాప్‌..ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ పొందిన ‘ఆయ్‌..మేం గోదారోళ్లమండి..’ పాటను సృష్టించిన కవి రాజమహేంద్రవరానికి చెందిన కవి నూజిళ్ల శ్రీనివాస్‌. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఇంగ్లిషు అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన ప్రవృత్తి తెలుగులో రచనలు చేయడం. ఇప్పటికి ఆయన 200కి పైగా గేయాలు, ఆరు కథలు, 30 వరకు వ్యాసాలు రాసారు. ఇవి అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘గోదారోళ్ల కితకితలు’ అనే ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహించే బొమ్మూరుకు చెందిన ఈవీవీ సత్యనారాయణ ఆ గ్రూప్‌ కోసం సభ్యుడైన నూజిళ్లతో ఈ పాటను రాయించి, వీడియో తీయించాలనుకున్నారు. గ్రూప్‌ సభ్యురాలితో పాడించి, రికార్డు చేశారు. అయితే వీడియో తీయించే లోగానే ఆ పాట బయటకు వచ్చి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్‌చల్‌ చేయడంతో ఇది అనేకమందికి చేరిపోయింది. దీనిలో గోదావరి యాస, భావాలు ఉండడంతో అందరికీ నచ్చేసింది. తర్వాత నూజిళ్ల శ్రీనివాస్‌ ఈ పాటను తానే స్వయంగా పాడి పోస్ట్‌ చేశారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.
సంతోషంగా ఉంది..
‘ఆయ్‌..మేం గోదారోళ్లమండి’ పాట ఇంత ఆదరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొన్న పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు ‘పదికి పదే జీవితం కాదురా చిన్నా’ అంటూ రాసిన గీతం పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. ఉగాది గీతం కూడా చాలామందికి చేరువైంది. ఈ స్ఫూర్తితో మరిన్ని గీతాలు రాస్తాను.
-నూజిళ్ల శ్రీనివాస్‌ 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు