ఆహ్లాదం..ఆనందం..ఆత్మీయం

18 Nov, 2016 21:43 IST|Sakshi
ఆహ్లాదం..ఆనందం..ఆత్మీయం
- జిల్లా అధికారుల వనభోజనం
– ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ఆయన సతీమణి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఒకవైపు తుంగభద్ర నది...  మరోవైపు నీటితో తొణికిసలాడుతున్న చెరువు.. మధ్యలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతవరణంలో జిల్లా అధికారుల కార్తీకవనమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆటాపాటా, విందువినోదాలతో ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. శుక్రవారం కర్నూలు మండలంలోని గర్గేయపురం నగరవనంలో జిల్లా అధికారుల కార్తీకవన మహోత్సవం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖఅ అధికారులు కార్తీకవనమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులను నగరవనానికి తీరలించేందుకు ప్రత్యేకంగా రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేవారు.  నగర వనం అందాలను చూసి అందనూ మురిసిపోయారు. వనం చుట్ట రింగ్‌ రోడ్డు తరహాలో రోడ్డు వేశారు. 
ఉసిరి చెట్టుకు పూజలు..
కలెక్టర్‌ సతీమణి సత్యరేఖ తొలుత ఉసిరి చెట్టుకు పూజచేసి కార్తీకవనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సహా పలువురు జిల్లా అధికారులు సతీమణులతో సహా పాల్గొన్నారు. దాండియా ఆట ఆడి సందడి చేశారు. జిల్లా అధికారుల కూతుళ్ల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్తీక వనభోజనం ముగిసిన తర్వాత నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలకు, జిల్లా అధికారులకు వేరువేరుగా తాడులాగడం, వాల్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. మహిళలల్లో కలెక్టర్‌ సతీమణి ఒక జట్టుగా, డీఆర్‌ఓ సతీమణి మరో జట్టుగా పోటీలు జరిగాయి.వాలీబాల్‌ పోటీల్లో కలెక్టర్‌ సతీమణి  జట్టు విజయం సాధించగా, తాడులాగే పోటీల్లో కలెక్టర్‌ జట్టు విజయం సాధించింది. జిల్లా అధికారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు నిర్వహించారు. మ్యూజికల్‌ చైర్స్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జరిగాయి.  
ఎంత హాయిలే ఇలా..
గార్గేయపురం చెరువులో అధికారులు, వారి సతీమణులు బోటు షికారు చేశారు.  ఇందుకోసం జిల్లా పర్యాటక సంస్థ అధికారులు ప్రత్యేకంగా సంగమేశ్వరం నుంచి బోట్‌లు తెప్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఆహ్లాదకరమైన వాతవరణంలో కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. నగరవనాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు నగర ప్రజలు వారాంతంలో ఇక్కడకు వచ్చి సంతోషంగా గడిపే విధంగా అబివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.  కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు,జడ్సీ సీఇఓ ఈశ్వర్,  సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్‌ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రావు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ప్రత్యేకకలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, డీఎస్‌ఓ తిప్పేనాయక్‌ , కర్నూలు ఆర్డీఓ రఘుబాబు దాదాపు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు