ఎన్నాళ్లకెన్నాళ్లకు

21 Sep, 2016 23:02 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు
  • ఏడు మార్కెట్‌ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు
  • ఏజెన్సీలో పీసా చట్టానికి అనుగుణంగా మార్పులు
  •  కొత్తగూడేనికి పాలకవర్గం ఖరారు
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఎట్టకేలకు జిల్లాలో మార్కెట్‌ కమిటీలకు కొత్త పాలకవర్గాలు రాబోతున్నాయి. పీసా చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నియామకానికి ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో భాగంగానే బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం మార్కెట్‌ కమిటీలు ఎస్టీ మహిళకు రిజర్వు కాగా.. ఇల్లెందు, ఏన్కూరు, కొత్తగూడెం, చర్ల ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యాయి. బుధవారం  కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మాలోతు హరిలాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. మైదాన  ప్రాంతంలో ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి,  ఏజెన్సీలో ఏన్కూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, చర్ల, భద్రాచలం, దమ్మపేట మార్కెట్‌లున్నాయి. ఖమ్మం మార్కెట్‌ పాలకవర్గం గడువు 2014తో ముగియగా.. మిగిలిన మైదాన ప్రాంత పాలక వర్గాలు 2015లో రద్దయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఏడు మార్కెట్లకూ  2007-08 నుంచి పాలకవర్గాల నియామకం జరగనేలేదు. ఏజెన్సీలో ఉన్న మార్కెట్‌ కమిటీల్లో కూడా జనలర్‌ కేటగిరికి చెందిన వారిని చైర్మన్లుగా నియమిస్తున్నారని, దీనివల్ల పీసా చట్టం అమలు కావడం లేదని, ఏజెన్సీలో చైర్మన్‌ పదవులు తమకే రిజర్వు చేయాలని గిరిజనులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఏడేళ్లుగా నియామకాలు జరగలేదు.
    ఎప్పుడో నిలిచి.. ఇప్పుడు భర్తీ..
    - జూలూరుపాడు, ఏన్కూరు రెండు మండలాలను కలిపి ఏన్కూరులో 1983లో మార్కెట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 2004 తర్వాత కొంతకాలం మార్కెట్‌ కమిటీకి ఏడీఎంలు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించారు. తర్వాత 2006 నుంచి 2007 వరకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మోత్కూరి యాదగిరి పనిచేశారు.
    - దమ్మపేట మార్కెట్‌ కమిటీ దమ్మపేట,అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో విస్తరించి ఉంది. 2013 నుంచి 2014 వరకు సున్నం నాగమణిని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఈ కమిటీ రద్దయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సున్నం నాగమణి హై కోర్టును ఆశ్రమించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సున్నం నాగమణినే తిరిగి చైర్‌పర్సన్‌గా కొనసాగాలని తీర్పు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో 2014 నుంచి 2015 వరకు నాగమణి ఈ మార్కెట్‌ కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దమ్మపేట మార్కెట్‌ కమిటీని గిరిజనులకే కేటాయించాలని గిరిజన సంఘాలు కోర్టులకు వెళ్లడంతో ఇక్కడ మార్కెట్‌ కమిటీకి ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు.
    -ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 1978లో ప్రారంభమైంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 7 మండలాలు, 86 గ్రామాలతో విస్తరించి ఉంది.  ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, గార్ల, కారేపల్లి, కామేపల్లి,  టేకులపల్లి మండలాలతో మార్కెట్‌ ఏర్పడింది. 2006లో పాలకవర్గం ఏర్పడగా.. గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన రావూరి వెంకట్రామయ్య చైర్మన్‌గా నియమించారు.బయ్యారం మండలానికి చెందిన కాంగ్రెస్‌ ఎస్సీ,ఎస్టీ సెల్‌ నాయకులు బి. పంతులూ నాయక్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏజెన్సీలో నాన్‌ ఎస్టీలతో మార్కెట్‌ పదవులు నింపడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో నాటి పాలకవర్గం రద్దయింది.  
    - బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ పరిధిలో  బూర్గంపాడు, ఆశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు ఉన్నాయి. గతంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల కూడా ఈ మార్కెట్‌కమిటి పరిధిలోనివే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రెండు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. ఇప్పటి వరకు ఈ మార్కెట్‌ కమిటీకి ఎనిమిదిమంది ఛైర్మన్లుగా పనిచేశారు. చైర్మన్లందరు గిరిజనేతరులే. 2009లో కొందరు గిరిజనులు కోర్టుకెక్కడంతో ఈ పాలకవర్గం నియామకానికి బ్రేక్‌ పడింది.
    - చర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి 2009 నుంచి  చైర్మన్‌ నియామకం లేదు. 2006లో నల్లపు దుర్గాప్రసాదరావును మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగా, 2009 వరకు ఆయన చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతంలోని మార్కెట్‌ కమిటీల చైర్మన్లను గిరిజనులకే కేటాయించాలంటూ గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో చర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చైర్మన్‌ నియామకం జరగలేదు.
    -భద్రాచలం మార్కెట్‌కు 2005 వరకు పాలక మండలి ఉంది. 2005లో భద్రాచలం పట్టణానికి చెందిన బుడగం శ్రీనివాసరావును చైర్మన్‌కు ఎంపిక చేశారు. ఆ తర్వాత పీసా చట్టానికి అనుగుణంగా నియామకం చేపట్టాలని గిరిజనుల డిమాండ్‌తో ఇక్కడ కూడా పాలక మండలి నియామకం చేపట్టలేదు.




     

మరిన్ని వార్తలు