భూ సేకరణపై అధ్యయనం చేయండి

22 Aug, 2015 01:58 IST|Sakshi

⇒ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశం
⇒ నిబంధనల సరళీకరణకు చర్యలు తీసుకోండి
⇒ చెరుకు సాగు విస్తీర్ణం పెంపుపై అధ్యయనం చేయాలని సూచన


 సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణలోని సమస్యలు అధ్యయనం చేసి, పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ, 18 అనుబంధ విభాగాలు, సంస్థల అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. భూ సేకరణలో జీవో 571 అడ్డుగా ఉందని అధికారులు తెలిపారు. నిబంధనల సరళీకరణకు చొరవ తీసుకోవాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు. చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర అంశాలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.

 ఎస్‌ఎఫ్‌సీ విభజనపై!: రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజనలో ఏపీ తీరును ఎదుర్కోవాలని, జీడిమెట్లలోని సంస్థ ఆస్తులపై ఏపీ ప్రభుత్వం మడత పేచీపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆప్కో నుంచి చేనేత కార్మికులకు అందాల్సిన బకాయిలు, నూతన మైనింగ్ పాలసీకి తుది మెరుగులు, టీఎస్‌ఐపాస్, పారిశ్రామిక వాడల్లో సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యద ర్శి అరవింద్‌కుమార్, ఉప కార్యదర్శి వి.సైదాతో పాటు రెవెన్యూ కార్యదర్శి మీనా, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మైనింగ్ డెరైక్టర్ మంగీరాం, ఎండీ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు