ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై విచారణ

3 Sep, 2016 00:01 IST|Sakshi
కమలాపూర్‌ : మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పి.సునీత ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణాధికారి, హుజూరాబాద్‌ డెప్యూటీ ఈవో కట్ల ఆనందం శుక్రవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సునీతపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం జరిపిన విచారణలో ఆమెతో పాటు గతంలో ఇక్కడ ఎంఈవోలుగా పనిచేసిన ఏవీ రమణారెడ్డి్డ, పి.ఝాన్సీలక్ష్మి నుంచి వేర్వేరుగా రాత పూర్వక వివరణలు తీసుకున్నారు. సునిత 2012 నవంబర్‌ 23 నుంచి 2013 మే 21 వరకు ప్రసూతి సెలవులు వినియోగించుకున్నారు. అయితే ఆమె బోగస్‌ డెలివరీ సర్టిఫికెట్‌ సమర్పించి ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడి 6 నెలల వేతనం పొందారని, అందుకు అప్పటి జిల్లా విద్యాధికారి లింగయ్య పూర్తిగా సహకరించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించిన నేపథ్యంలో గతేడాది జూన్‌ 6న జగిత్యాల డెప్యూటీ ఈవో జగన్మోహన్‌రెడ్డి కమలాపూర్‌లో విచారణ జరిపారు. సునీత అస్వస్థతకు గురవడంతో విచారణ మధ్యలోనే ఆగిపోయింది. డీఈవో ఆదేశాల మేరకు ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై మరోసారి విచారణ జరిపామని, విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నట్లు విచారణాధికారి తెలిపారు. కార్యక్రమంలో సహాయ విచారణాధికారులు రాంరెడ్డి, భాగ్యవతి, ఎంఈవో రాంకిషన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు