ఎన్యూమరేటర్ సస్పెన్షన్

23 Nov, 2016 03:42 IST|Sakshi
ఎన్యూమరేటర్ సస్పెన్షన్

స్మార్ట్ పల్స్ సర్వే  వేగవంతం చేయాలని  కలెక్టర్ ఆదేశం
విజయనగరం మున్సిపాలిటీలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ

విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే తుది దశకు చేరుకుందని, ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని ప్రజలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని  కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని  పలుప్రత్యేక శిబిరాల్లో చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిధిలో గల లంకాపట్నం ఆది ఆంధ్ర మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. అక్కడ సర్వే కోసం  ప్రజలెవ్వరు రాకపోగా... నియమించిన ఇద్దరు ఎన్యూమరేటర్లలో విధులకు గైర్హాజరైన త్రినాథ్‌ను విధుల నుంచి సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ ఇంజినీర్‌ను ఆదేశించారు. అదేవిధంగా  10వ వార్డులోని  ఆదిభట్ల నారాయణ దాసు పురపాలక ప్రాథమిక పాఠశాలలో, 20వ వార్డులోని జొన్నగుడ్డి వినాయకనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా 20 వ వార్డకు కేటారుుంచిన ఇద్దరు ఎన్యూమరేటర్లు 209 మందిని సర్వే చేయాల్సి ఉండగా.. మరో 94మంది సర్వే పరిధిలోకి రావాల్సి ఉన్నట్లు వివరించారు. తరువాత  30 వ వార్డు పరిధిలోని  కంటోన్మెంట్ హిందూమున్సిపల్ ప్రైమరీ పాఠశాల  పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. సర్వే చేపడుతున్న ప్రక్రియను  స్వయంగా పరిశీలించారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో  సర్వే పరిధిలోకి రాకుండా మిగిలిపోరుున వారి కోసం ఈనెల 19 నుంచి 23వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ కార్యాలయాలతో పాటు  పట్టణ పరిధిలో వార్డు పోలింగ్ బూత్‌లలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.

ఇప్పటి వరకు సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారంతా విధిగా వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెనుక మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, విజయనగరం తహసీల్దార్ శ్రీనివాసరావు, టౌన్‌ప్లానింగ్ అధికారి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు