9న జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి

7 Jun, 2017 22:51 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : ‘ఖరీఫ్‌ పంటల సాగుని పురస్కరించుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 9న జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలి.’ అని  జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌  అధికారుకులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తితో కలిసి వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో ఏరువాక పౌర్ణమిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 మాట్లాడుతూ వివిధ శాఖల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరేలా స్టాల్స్‌ని ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు అవసరమైన పరిజ్ఞానంతో పాటు వారికి ఉన్న పథకాలు, రాయితీలు అర్థమ్యేలా వివరించాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ జి.సన్యాసిరావు, పట్టుశాఖ జేడీ అరుణకుమారి, ఆత్మా పీడీ నాగన్న, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ డీడీ హీరానాయక్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు