వైజాగ్‌లో సన్నాఫ్ సత్యమూర్తి భూ దందాలు...

12 Jun, 2016 09:55 IST|Sakshi
వైజాగ్‌లో సన్నాఫ్ సత్యమూర్తి భూ దందాలు...

ఇదిగో సెటిల్‌మెంట్ల బండారం

విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గంలో రెండేళ్లుగా విచిత్రమైన పాలన నడుస్తోంది. అక్కడ టీడీపీ కీలక నేత కుమారుడు చెప్పిందే వేదం. ఏ పని జరగాలన్నా సదరు పుత్రరత్నం గారి అనుమతి, అనుగ్రహం తప్పనిసరి. అధికారికంగా ఎటువంటి హోదా లేనప్పటికీ ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ వేదిక మీద అతనికి సీటు వేయాల్సిందే. లేదంటే  అధికారులు బదలీ అయిపోతారు. అందుకే.. ఎందుకొచ్చిన గొడవని గౌరవ ప్రజాప్రతినిధుల సరసన అతన్ని కూర్చోబెట్టి మరీ ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన నవనిర్మాణ దీక్ష ప్రారంభోత్సవాన్ని సైతం పుత్రరత్నంతోనే కానిచ్చేశారు.

గ్రామాలు, కాలనీల్లో పర్యటించినప్పుడు జోనల్ కమిషనర్, మండల రెవెన్యూ, మండల పరిషత్ స్థాయి అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి అతని వెంట నడుస్తున్నారు. అధికారం తమదే కావడంతో ప్రతి పనిలోనూ కాసుల వేట సాగిస్తున్న సదరు పుత్రరత్నం ఈ రెండేళ్లలో దాదాపు రూ. 80 కోట్లకు పడగలెత్తారని చెబుతున్నారు. పెందుర్తిలో సదరు టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడు వెలగబెట్టిన పంచాయితీలు, పాల్పడ్డ వసూళ్ల చిట్టాలో మచ్చుకు కొన్ని...


గుర్రమ్మపాలెంలో ఏపీఐఐసీ  స్వాధీనం చేసుకున్న సుమారు 110 ఎకరాల భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఎకరాకు రూ.23 లక్షలు చొప్పున రైతులకు అందించింది.  ఇందులో సన్నాఫ్ టీడీపీ నేత దందా నడిచింది. రెవెన్యూ అధికారుల సహకారంతో సుమారు 20 ఎకరాల్లో బినామీలను సృష్టించి ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని నొక్కేశాడు. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ఇదే భూముల్లో నష్టపరిహారం పొందిన అర్హులైన  రైతుల నుంచి ఎకరాకు రూ.లక్ష వంతున వసూలు చేశాడు.  మొత్తంగా ఈ వ్యవహారంలో రూ.5 కోట్లకుపైనే చక్కబెట్టాడు.


ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ సదరు టీడీపీ నేత కొడుకుదే కీలక పాత్ర. అసలు వారసులు, నకిలీల మధ్య తగవు పెట్టింది అస్మదీయులైతే..  ఈ వివాదాన్ని సెటిల్‌మెంట్ చేస్తానంటూ ఈయనగారు రూ. పది కోట్లు డిమాండ్ చేశారట. దీనికి అసలు వారసులు ససేమిరా అనడంతోనే కేసులతో వేధిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.


హిందుజా పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో నిరుద్యోగి నుంచి  కనీసం రూ.3 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సుమారు వందమంది నుంచి రూ.3 కోట్లు వరకు కొల్లగొట్టాడు.


వేపగుంట, పెందుర్తి బీఆర్‌టీఎస్ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్‌లు ఇప్పించినందుకు సన్నాఫ్ టీడీపీ నేత రూ.5 కోట్లు కొట్టేశారు.

ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగాల పేరిట రూ.3 కోట్లు వసూల్ చేశారు. తీరా..  వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో  ఉద్యోగాలూ రాలేదు.. ఈయన తీసుకున్న డబ్బులూ వెనక్కి రాలేదు.


నియోజకవర్గంలో ఏ అపార్ట్‌మెంట్ నిర్మాణం తలపెట్టినా ఈయనకు గుడ్‌విల్ అందాల్సిందే. లేదంటే అనుమతులు ఆగిపోతాయి. అధికారులు కొర్రీలు వేస్తారు. అందుకే.. అక్కడ ఏ నిర్మాణం చేపట్టినా ఈయన గారి వాటా ముందుగా సమర్పించేస్తారు. అలా..  ఇప్పటివరకు రూ.ఆరేడు కోట్ల మేర ఈయన ఖాతాలో చేరిపోరాయట.

పెందుర్తి, పరవాడ, సబ్బవరం రెవెన్యూ విభాగాల్లోని అక్రమార్కులు ఈయనకు వంతపాడుతూ.. వాటాలు ఇస్తుంటారు. అవసరమైతే రెవెన్యూ రికార్డులు కూడా మార్చేస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తుంటారు. అందుకే కొంతమంది రెవెన్యూ అధికారులకు ఏళ్లు దాటినా బదలీల ఊసే ఉండదు. ఇక అధికారం ఎవరి వైపు ఉంటే వారి అడుగులకు మడుగులొత్తే ఖాకీలు సహజంగానే ఇతనికి దాసోహమైపోయారు. ఇలా అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న పచ్చ పుత్రుని ఆగడాలకు పరకాష్ట ఏమిటంటే...  అసాంఘిక కార్యకలాపాలకు  తన గెస్ట్‌హౌస్‌ను వేదిక చేయడం. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణ పేరిట సుజాతనగర్‌లో ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకున్నారు. అయితే ఆ ఫ్లాట్ పార్టీ కార్యక్రమాల కంటే విలాస ‘పార్టీ’లకే వేదికగా మారిందని టీడీపీ శ్రేణులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

 

మరిన్ని వార్తలు