ఎవరెస్ట్‌ విజేతకు ఊరు జేజేలు

10 Jun, 2017 22:59 IST|Sakshi
ఎవరెస్ట్‌ విజేతకు ఊరు జేజేలు
  • lదుర్గారావుకు స్వగ్రామంలో ఘనస్వాగతం
  • lసన్మానించిన భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య
  •  
    వీఆర్‌పురం (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడు కుంజా దుర్గారావు శుక్రవారం సాయంత్రం స్వగ్రామం కుంజవారిగూడెం చేరుకోగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు  ఘనంగా స్వాగతం పలికారు. దుర్గారావు గత నెల 13న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. పలువురు దుర్గారావును కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అతడిని ఘనంగా సన్మానించారు. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన దుర్గారావు అతి చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి వీఆర్‌పురం మండలానికి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చాడని కొనియాడారు. దుర్గారావుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు వెంటనే చెల్లించాలని, అతడి కుటుంబానికి పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వాలని,  దుర్గారావు ఉన్నత చదువులకు అవసరం అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని కోరారు. ఎంపీపీ కారం శిరమయ్య, సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ,బొప్పెన కిరణ్‌ పాల్గొన్నారు.
    అందరి ఆశీస్సుల  ఫలితమే ..
    తల్లిదండ్రులు, గురుకుల సొసైటీ అధికారుల ఆశీస్సులతో పాటు కోచ్‌ భద్రయ్య కృషి ఫలితంగానే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించగలిగానని దుర్గారావు అన్నాడు. గత ఏప్రిల్‌ 8న ప్రారంభమైన ఎవరెస్ట్‌ పర్వతారోహణ మే 13న ముగిసిందని  తెలిపాడు. ఆరోజు  ఉదయం ఆరు గంటలకు ఎవరెస్ట్‌పై జాతీయ జెండా, గురుకుల జెండాలు ఎగురవేయడంతో పాటు ,అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ప్రదర్శించానని  తెలిపాడు. తన విజయానికి కారకులందరికీ రుణపడి ఉంటానన్నాడు.  
     
మరిన్ని వార్తలు