ఎవరి ఉద్యోగాలు వారే చేయాలి

26 Sep, 2016 23:25 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వివిధ శాఖల్లో వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వికలాంగులు వారి విధుల్లో వారు మాత్రమే పనిచేయాలని, వేరే వ్యక్తులు పనిచేయడానికి వీలులేదని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం ‘మీ కోసం’ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన కొంతమంది వారు పనిచేయకుండా వారి తరఫున వేరే వారితో పనిచేయిస్తున్నారని, ఎవరు ఉద్యోగం పొందారో వారే పనిచేయాలన్నారు. వేరే వారు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను కలెక్టర్‌ భాస్కర్‌కు చెప్పుకున్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 
ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతోంది
కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు రాజ్యమేలుతున్నారని అటువంటి వారిని గుర్తించి ఆయా శాఖాధికారులు వారిని పక్కనపెట్టాలని లేకపోతే భారీ కుంభకోణాల్లో అధికారులు ఇరుక్కుపోయే ప్రమాదమున్నదని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీపీవో, పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు గుమాస్తాలను బయటకు పంపిస్తే మళ్లీ అవే కార్యాలయాల్లో తిష్టవేశారన్నారు. అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని చెప్పారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో సహా 8 పురపాలక సంఘాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు.  
నా ఫైల్స్‌ నేనే మోస్తున్నా
కలెక్టర్‌గా నాకు కనీసం అటెండర్‌ కూడా లేడని, నా ఫైల్స్‌ నేనే మోసుకుంటున్నానని.. ఇలా చేయడంలో తప్పేమీ లేదని కలెక్టర్‌ భాస్కర్‌ వ్యాఖ్యానించారు. తన కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా లేడని అయినా రోజుకు 450 ఫైల్స్‌ పరిష్కరిస్తున్నానని, 67 శాఖల అధికారులతో చర్చిస్తున్నానని చెప్పారు. ప్రతి అధికారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చని, ఐదు వారాలుగా అధికారులు మీకోసం, ఈ–ఫైలింగ్‌లో అనేక శాఖలు సమస్యలను పరిష్కరించడం లేదని, ప్రజలకు సేవలు అందడం లేదన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్‌ షరీఫ్, జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
>
మరిన్ని వార్తలు