బెజవాడలో పెరిగిన ఈవ్‌టీజింగ్‌

2 Oct, 2016 18:44 IST|Sakshi
బెజవాడలో పెరిగిన ఈవ్‌టీజింగ్‌
  • కళాశాలలు, బస్సుల్లో అల్లరిమూకల హల్‌చల్‌
  • ఆకతాయిలపై కొరవడిన పోలీసు నిఘా
  • ‘మేం కంకిపాడులో ఉంటున్నాం. నా కుమార్తె రోజూ విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతోంది. రోజూ సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత వచ్చి తీసుకెళ్తున్నాను. ఇటీవల కాలంలో బెంజిసర్కిల్‌ నుంచి పటమట వరకు ఆడపిల్లలను వేధించే గ్యాంగ్‌లు పెరిగాయి. విద్యార్థినులను వెంబడిస్తూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ నా కుమార్తెను ఒంటరిగా పంపడానికి భయమేస్తోంది.’ 

    – ఇదీ కంకిపాడుకు చెందిన వెంకటేశ్వరరావు ఆవేదన 

     
    విజయవాడ : నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల అల్లరిగ్యాంగ్‌ల ఆగడాలు మళ్లీ పెరిగిపోయాయి. హైస్కూళ్లు, కాలేజీల వద్ద చేరి ఆడపిల్లలను అల్లరి చేస్తున్నారు. నగరంలో ప్రయివేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ఈవ్‌టీజింగ్‌కు విద్యార్థినులు బెంబేలెత్తిపోతున్నారు. చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేవరకు తల్లిడండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ చేసే గ్యాంగ్‌లపై పోలీసు నిఘా కొరవడిందని, అందువల్లే రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా కొరడటంతో తప్పనిసరిగా తాము రోజూ వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

    చికటి పడితే వణుకే...

    పటమట ఏరియాలోని బెంజిసర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు పలు కార్పొరేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో తరగతులు రాత్రి ఏడు గంటలకు పూర్తవుతాయి. కళాశాలలన్నీ ఒకేసారి వదులుతున్నారు. ఒకేసారి వేలాది మంది విద్యార్థినులు కళాశాల బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఎక్కేందుకు బందరు రోడ్డుపైకి వస్తున్నారు. ఆ సమయంలో ఆకతాయిలు గుంపులు, గుంపులుగా అక్కడికి చేరుకుని వెకిలి చేష్టలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. కొన్నిసార్లు చీకట్లో ఆకతాయిలు శృతిమించి ప్రవర్తిస్తుండటంతో విద్యార్థినులు వణికిపోతున్నారు.

    బస్టాపుల్లో బాధలు వర్ణనాతీతం..

    బెంజిసర్కిల్, పటమట ప్రాంతంలోని విద్యా సంస్థల్లో కంకిపాడు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, నిడమానూరు తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు రాత్రి 7 గంటలకు తరగతులు ముగిసిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ఆటోల కోసం బస్టాపుల్లో పడిగాపులు పడుతుంటారు. ఆ సమయంలో ఈవ్‌టీజర్లు రెచ్చిపోతున్నారు. నిక్‌ నేమ్‌లతో కామెంట్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కొందరు వింత చేష్టలతో వేధిస్తున్నారు.

    బైక్‌లపై వెంబడిస్తూ... 

    కొందరు ఈవ్‌టీజర్లు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం, కానూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఇంజినీరింగ్‌ కళాశాలల ఆడప్లిల బస్సులను బైక్‌లపై వెంబడించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మరికొందరు రాత్రివేళ బస్సుల్లో వస్తున్న ఆడపిల్లలను బైక్‌పై వెంబడిస్తూ మద్యం తాగి కేకలు వేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. మద్యం ఖాళీ సీసాలను బస్సులపై విసురుతూ బీభత్సం సష్టిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నిఘా పెంచి అల్లరిమూకల ఆగడాలకు కళ్లెం వేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 
     
మరిన్ని వార్తలు