శ్రుతిమించుతున్న ఈవ్‌టీజింగ్‌

20 Jul, 2016 20:12 IST|Sakshi
 
  •  చర్యలు తీసుకోవాలన్న అధ్యాపకుడు
నెల్లూరు(క్రైమ్‌):
జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈవ్‌టీజర్లు రెచ్చిపోతున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిత్యం పోలీసులు సంచరించే ప్రాంతంలోనే వేధింపులకు గురవుతుండటంతో బాధిత తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సమీపంలో డీకేడబ్ల్యూ కళాశాల ఉంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు కళాశాలలో విద్యనభ్యసించేందుకు వస్తున్నారు. కళాశాల పోలీసు కార్యాలయానికి సమీపంలో ఉండటంతో తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తల్లిదండ్రులు ఎంతో ధైర్యంతో వారిని కళాశాలకు పంపుతున్నారు. అయితే కొంతకాలంగా విద్యార్థినులు ఈవ్‌టీజర్ల వేధింపులకు గురౌతూ ఆందోళన చెందుతున్నారు.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొందరు ఆకతాయిలు బైక్‌లపై కళాశాలకు సమీపంలోని బస్టాండ్ల వద్ద  విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో బుధవారం కళాశాలలో అధ్యాపకునిగా పనిచే స్తోన్న సుధాకర్‌రెడ్డి ఈవ్‌టీజర్‌ల బారి నుంచి విద్యార్థినిలను రక్షించాలని ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తోన్న సౌత్‌ట్రాఫిక్‌ ఎస్‌ఐ వీరనారాయణకు ఫిర్యాదు చేశారు. ఇకపై తాము సైతం ఆకతాయిలపై దృష్టిసారిస్తామన్నారు. తాము అందుబాటులోలేని సమయంలో డయల్‌ 100కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం సుబ్బారెడ్డి పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. 
 
ఈవ్‌టీజింగ్, నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల, విద్యార్థుల ఆందోళన 
మరిన్ని వార్తలు