అంతా‘ కొత్త’గా

23 Aug, 2016 21:58 IST|Sakshi
అంతా‘ కొత్త’గా
  • రెండు రాష్ట్రాలతో   కొత్తగూడెం సరిహద్దు
  • రెండు రాష్ట్రాల నుంచి ఒకటికి తగ్గిన ఖమ్మం
  • కొత్తగూడెం పరిధిలోకే ప్రధాన పరిశ్రమలు
  • విస్తీర్ణంలో రాష్ట్రంలోనే  గూడెం పెద్ద జిల్లా
  • వాణిజ్య కేంద్రంగానే మిగలనున్న ఖమ్మం
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం : డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌తో జిల్లా రెండుగా విడిపోతోంది. పోలవరం ముంపు మండలాల విలీనం తర్వాత జిల్లాకు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అయితే కొత్తగూడెం జిల్లాగా ఏర్పడుతుండటంతో ఇప్పుడు ఈ జిల్లాకు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సరిహద్దున ఉంటాయి. ఖమ్మంకు ఆంధ్రప్రదేశ్‌తోనే సరిహద్దు ఉంటుంది. ఖమ్మం జిల్లాలోకి 22 మండలాలు, భద్రాద్రి జిల్లాలోకి 18మండలాలను చేరుస్తూ ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌  విడుదల చేసింది. కొత్తగూడెం జిల్లాకుS పూర్తిగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ మండలాలున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి, కామేపల్లి మండలాలతోపాటు పెనుబల్లిలోని కొన్ని గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగా ఉన్నాయి. అయితే వీటి పాలన భద్రాచలం ఐటీడీఏ పరిధిలోకి వస్తుందా.. ? కొత్తగా ఖమ్మం జిల్లా పరిధిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తారా..? అనే దానిపై నిర్ణయం జరగలేదు. వాజేడు, వెంకటాపురం, చర్ల సరిహద్దులో ఛత్తీస్‌గఢ్, చివరన భూపాలపల్లి జిల్లా.. ఇల్లెందు సరిహద్దులో మహబూబాబాద్‌ జిల్లా.. సుజాతనగర్‌ సరిహద్దులో ఖమ్మం జిల్లాలు  కొత్తగూడెం జిల్లాకు సరిహద్దులో ఉంటాయి.  ఖమ్మం జిల్లాకు జూలూరుపాడు సరిహద్దులో  కొత్తగూడెం జిల్లా.. నాయకన్‌గూడెం సరిహద్దులో సూర్యాపేట జిల్లా.. ఖమ్మం అర్బన్‌ మండలం సరిహద్దులో మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దుగా ఉంటాయి.  
    ప్రధాన పరిశ్రమలకు నెలవు ‘గూడెం’...
    జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, భారజల కర్మాగారం, ఎన్‌ఎండీసీ, ఐటీసీ, వంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ  కొత్తగూడెం జిల్లాలోకే రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ మినహాయిస్తే ఇన్ని పరిశ్రమలున్న జిల్లాగా కొత్తగూడెం గుర్తింపు పొందనున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిశ్రమల కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేసే అవకాశముంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవనున్నది. 8,044.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. 11,38,910 మంది జనాభాతో ఉన్న కొత్తగూడెం వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ జిల్లా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది. ఈ జిల్లాలో అటవీ విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది. 
     వాణిజ్య కేంద్రంగా ఖమ్మం..
    ఖమ్మం ఇక వాణిజ్య కేంద్రంగానే మిగలనుంది. ఇక్కడ గ్రానైట్‌  ముఖ్య పరిశ్రమగా కొనసాగుతోంది. అలాగే  ఆస్పత్రులు, బంగారు షాపులు, పత్తి, మిర్చి వంటి వ్యాపారం ఇక్కడ కోట్ల రూపాయల్లో సాగుతోంది. మూడు జిల్లాల పరిధిలోని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తమ పంటలను విక్రయిస్తుంటారు.   ఇక్కడి నుంచి విదేశాలకు కూడా పత్తి, మిర్చి వంటి పంటలు ఎగుమతి అవుతుంటాయి.  
మరిన్ని వార్తలు