బీఎన్‌ఆర్‌ కన్నుమూత

7 May, 2017 23:24 IST|Sakshi
బీఎన్‌ఆర్‌ కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
– కుటుంబ సభ్యులు, అభిమానుల్లో విషాదఛాయలు
– పలువురు ప్రముఖుల సంతాపం
– నేడు పెనకలపాడులో అంత్యక్రియలు


అనంతపురం : బీఎన్‌ఆర్‌ అంటూ  అభిమానులు ప్రేమగా పిలుపుచుకునే అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సోదరుడు రెడ్డప్పరెడ్డి నివాసంలో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేవారు. ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం భౌతికకాయాన్ని అనంతపురంలోని అరవిందనగర్‌లో గల నివాసం వద్దకు తీసుకొచ్చారు. బంధువులు, పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనవద్దకు వచ్చిన వారికి చేతనైన సాయం చేసేవ్యక్తిగా పేరు తెచ్చుకున్న బీఎన్‌ఆర్‌ ఇక లేరనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు, అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు అనంతపురం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందనీ, మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామమైన కణేకల్లు మండలం పెనకలపాడులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

పలువురు నాయకుల సంతాపం
బీఎన్‌ఆర్‌ మృతి చెందాడనే విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు, పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు వెన్నçపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, కవిత, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాగే పరుశురాం,  ధనుంజయయాదవ్, వెన్నపూస రవీంద్రరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి,   రంగంపేట గోపాల్‌రెడ్డి,  చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు కదలికి ఎడిటర్‌ ఇమాం, ఏఎఫ్‌ ఎకాలజి సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నూర్‌మహమ్మద్, డిప్యూటీ మేయర్‌ గంపన్న, మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు పలువురు అధికారులు, వైద్యులు, పార్టీ అనుంబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం తెలియజేశారు.

కాంట్రాక్టర్‌ వృత్తి నుంచి రాజకీయాల్లోకి...
నారాయణరెడ్డి కుటుంబం కాంట్రాక్టర్‌ వృత్తి నుంచి రాజకీయంలోకి అడుగుపెట్టింది. కణేకల్‌ మండలం పెనకలపాడు (హనకనహల్‌)కు చెందిన లక్ష్మన్న, తిప్పమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు శ్రీరామిరెడ్డి, నారాయణరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి, గురునాథరెడ్డితోపాటు ఇద్దరు కూతుళ్లు. వీరిలో నారాయణరెడ్డి రెండో కుమారుడు. ఈయన 1947 ఫిబ్రవరి 16న జన్మించాడు. వృత్తిరీత్యా అనంతపురంలో స్థిరపడ్డారు. రాజకీయాలపై ఆసక్తితో 1989లో అనంతపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1994లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004లో ఎమ్మెల్యేగా పని చేశారు.

వైఎస్‌తో ప్రత్యేక అనుబంధం
బి. నారాయణరెడ్డి (బీఎన్‌ఆర్‌)కి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉంది. బీఎన్‌ఆర్‌ ఇంట్లో అందరినీ వైఎస్‌ పేరు పెట్టి పిలిచేటంత సన్నిహితంగా ఉండేవారు. వైఎస్సార్‌ బళ్లారిలోని కళాశాలలో బీఎస్సీ చదుతుండగా...బీఎన్‌ఆర్‌ అదే  కళాశాలలో పీయూసీ చదివేవారు. అక్కడి నుంచి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తర్వాత కూడా వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నడిచాడు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఎన్‌ఆర్‌కు బ్రెయిన్‌ ఎమరేజ్‌ అయి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌ వచ్చి పరామర్శించారు.  అనంతపురం నగరానికి పీఏబీఆర్‌ నీటిని తెప్పించడంలో బీఎన్‌ఆర్‌ కృషి కూడా చాలాఉంది. వైఎస్సార్‌ అనంతపురం ఎప్పుడు వచ్చినా... ,చివరకు సీఎం హోదాలో వచ్చినా బీఎన్‌ఆర్‌ నివాసానికి వచ్చేవారు.

సౌమ్యుడిని కోల్పోయాం - మాజీ ఎంపీ అనంత
మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి మృతితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సౌమ్యుడిని కోల్పోయిందని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. బీఎన్‌ఆర్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణరెడ్డి ప్రజలకు విశేష సేవలందిచారన్నారు. నీటి పారుదల అంశాలపై మంచి అవగాహన కల్గి ఉండేవారన్నారు. అనంతపురం నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి పాటు పడ్డారని గుర్తు చేశారు. ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితంగా ఉండేవారన్నారు.

మంచి వ్యక్తిని కోల్పోయాం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సౌమ్యుడిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి మృతితో  మంచి వ్యక్తిని కోల్పోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణరెడ్డి మృతికి  సంతాపం తెలియజేస్తున్నామన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజకీయాల్లో శత్రుత్వం లేకుండా అందరితో కలిసి ఉండేవారన్నారు.

మరిన్ని వార్తలు