ప్రధానిని కలిస్తే ఉలుకెందుకో?

14 May, 2017 23:27 IST|Sakshi

మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం
గుమ్మఘట్ట/ డి.హీరేహాళ్‌ (రాయదుర్గం) : ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిస్తే అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఉలుకెందుకని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన గుమ్మఘట్ట మండలం భూపసముద్రం, డి.హీరేహాళ్‌ మండలం మలపనగుడి గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యలను వైఎస్‌ జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళితే టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అవగాహన లేకుండా మాట్లాడటం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుకున్న చంద్రబాబు అండ్‌ కో ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.  ‘ఉచితం’ ముసుగులో ఇసుకను కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు నీటి వ్యాపారానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. డి.హీరేహాళ్‌ మండలంలోని గ్రామాల్లో తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు నీటిని కర్ణాటకలోని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర గిట్టుబాటు కాక.. పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల బాధతో మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసులు మరో రకంగా నమోదు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  

>
మరిన్ని వార్తలు