విఠల్‌రావు దేశ్‌పాండే ఇకలేరు..

28 Jul, 2016 23:41 IST|Sakshi
విఠల్‌రావ్‌ దేశ్‌పాండే(ఫైల్‌)
  • హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో మృతి
  • నేడు ఆదిలాబాద్‌లో అంత్యక్రియలు
  • ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, వృద్ధ నేత విఠల్‌రావ్‌దేశ్‌పాండే (85) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు మొదట ఆదిలాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి కుదుట పడకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
     
    విఠల్‌రావు దేశ్‌పాండే భార్య సుమన్‌బాయి దేశ్‌పాండే నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఆయన సొంత ఇంట్లో నివసించేవారు. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన నిరాడంబరంగా ఉండేవారు. ఇటీవల అస్వస్థతకు గురయ్యే వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయనకు నలుగురు కుమారులు రిటైర్డ్‌ వెటర్నరి డాక్టర్‌ దేవిదాస్‌ దేశ్‌పాండే, హైకోర్టు న్యాయవాది వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే, ఉపాధ్యాయులు విశ్వాస్‌ దేశ్‌పాండే, సతీష్‌ దేశ్‌పాండే ఉన్నారు.
     
    కుమారుల్లో వినోద్‌కుమార్‌ మినహా మిగితా వారు ఆదిలాబాద్‌లోనే నివసిస్తారు. వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు భార్గవ్‌దేశ్‌పాండే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా.. విఠల్‌రావు దేశ్‌పాండే 1962 నుంచి 1967 వరకు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
     
    అంతకుముందు 1957 నుంచి 1962 వరకు సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎమ్మెల్యే పదవి అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1968 నుంచి 1972 వరకు ఆంధ్రప్రదేశ్‌ షుగర్‌బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1972 నుంచి 1978 వరకు డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పదవిలో ఉన్నారు. 1978 నుంచి 1981 వరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని గురువారం రాత్రి 10 గంటల వరకు ఆదిలాబాద్‌కు తీసుకురానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
     
    పలువురి సంతాపం..
    విఠల్‌రావు దేశ్‌పాండే మృతి తీరని లోటని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమకాలిన రాజకీయాలకు ఆయన ఆదర్శప్రాయుడని అభిప్రాయపడ్డారు. నిరాడంబరుడిగా జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడారు. విఠల్‌రావు దేశ్‌పాండే మృతిపట్ల బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆదిలాబాద్‌ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు