సత్యదేవుని దర్శించిన మాజీ ప్రధాని

29 Aug, 2016 20:49 IST|Sakshi
సత్యదేవుని దర్శించిన మాజీ ప్రధాని
  • వ్రతమాచరించిన  దేవెగౌడ  దంపతులు 
  • ఘన స్వాగతం పలికిన ఆలయ వర్గాలు 
  • అన్నవరం : 
    విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి ఒకేచోట కొలువైన సత్యదేవుని ఆలయాన్ని దర్శించడం, ఆ స్వామి వ్రతమాచరించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. సోమవారం ఆయన భార్య చెన్నమ్మతో కలిసి రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సత్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. సత్యదేవుడిని దర్శించి వ్రతమాచరించమన్న కొందరి సూచనతోనే వచ్చానని చెప్పారు. తెలంగాణ  రాష్టంలోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడిని కూడా దర్శించుకున్నట్టు చెప్పారు. రత్నగిరి పశ్చిమ రాజగోపురం వద్ద గల లిఫ్ట్‌ ద్వారా స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న దేవెగౌడ దంపతులకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకస్వాములు  ఘనంగా స్వాగతం పలికారు. 
    ఆంగ్లంలో వ్రతకథ
    సత్యదేవుని వ్రతమాచరించిన దేవెగౌడ దంపతులకు పండితులు ఆంగ్లంలో వ్రతకథ వినిపించారు. మొదట విఘ్నేశ్వర పూజ, అష్టదిక్పాలకుల ఆవాహనను కల్యాణబ్రహ్మ ముత్య సత్యనారాయణ చేయించగా, వ్రతకథను భాగవతుల వేంకట చలపతి ఆంగ్లంలో చెప్పారు. అనంతరం ఆ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందచేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు ఆలయానికి దిగువ భాగంలో గల యంత్రాలయాన్ని కూడా దర్శిస్తారు. అయితే వయోవృద్ధులైన దేవెగౌడ దంపతులు స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం తిరిగి లిఫ్ట్‌ ద్వారా పశ్చిమరాజగోపురం వద్దకు చేరుకుని బస చేసిన వినాయక అతిథి గృహానికి వెళ్లారు. వారి వెంట పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ తదితరులున్నారు. దేవెగౌడ బస చేసిన వినాయక అతిథిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
     
మరిన్ని వార్తలు