జై జవాన్‌.. జై కిసాన్‌

19 Oct, 2016 23:26 IST|Sakshi
చిరుధాన్యాల పంటలో కలుపు తీస్తున్న ప్రసాదరావు
పంటల సాగులో మాజీ సైనికుడు
36 ఏళ్లపాటు దేశరక్షణ విధులు 
ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం
40 రకాల పంటల సాగుతో ఆదర్శం
 
 
కురుపాం: అప్పుడూ.. ఇప్పుడూ ఆయన ఏరేస్తున్నాడు. పీకి పారేస్తున్నాడు. అది యుద్ధభూమి.. ఇది పంట భూమి. దేశ సరిహద్దుల్లో శత్రుసైనికుల్ని ఏరేసిన ఆ చేతులే ఇప్పుడు పంటపొలాల్లోని కలుపు మొక్కల్ని ఏరేస్తున్నాయి. దేశ రక్షణకు సైనికుల సేవలు ఎంత అవసరమో.. ప్రజల ఆకలి తీర్చేందుకు రైతు పండించే ఆహారం అంతే అవసరం. ఆ రెండు పనులు చేయడం తనకెంతో ఇష్టమంటుఽన్నాడు ఓ మాజీ జవాన్‌. ఆయనే కురుపాంకు చెందిన పాలక ప్రసాద్‌. జియ్యమ్మవలస మండలం పెదతుంబలి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన పాలక ప్రసాద్‌ కురుపాంలోని వైరిచర్ల కాలనీలో స్థిరపడ్డారు. ఈయన పదో తరగతి ఉత్తీర్ణుడైన వెంటనే 1980లో బీఎస్‌ఎఫ్‌ జవానుగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి 36 ఏళ్లపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా సరిహద్దుల్లో చొరబాటుదారులను అడ్డుకోవడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. సూపర్‌ నేషన్‌ ర్యాంక్‌ (ఎస్‌ఐ) సాధించిన వెంటనే ఉద్యోగ విరమణ చేసిన ప్రసాదరావుకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ. 2016లో ఉద్యోగ విరమణ పొందిన వెంటనే ప్రభుత్వం రెండుసార్లు సెక్యూరిటీ అధికారిగా ఉద్యోగం కల్పించినా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం 1993లో ఇచ్చిన 2 ఎకరాల 82 సెంట్ల బీడు భూమిలో సేద్యం ప్రారంభించారు. ఇప్పుడాయనకు ఇష్టమైన వ్యాపకం ఒకటే.. అది వ్యవసాయం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే గడుపుతారు.
 
సేంద్రియ విధానంలో సాగు
 
తన భూమిలో మామిడి, జీడి, జామ, బొప్పాయి, ద్రాక్ష, చిక్కుళ్లు, వంకాయ, టమాటా,  పొట్టి చిక్కుళ్లు, తమలపాకులు, ఆవాలు, కొబ్బరి, పెసలు, నువ్వుల పంటను సేంద్రియ విధానంలో ఽసాగు చేస్తున్నారు. పొలంగట్లపై టేకు వంటి చెట్లను పెంచుతున్నారు. ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా స్వయంగా వేప, తులసి ఆకుల తో  తయారు చేసిన కషాయాలనే మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. మామిడి, కొబ్బరి, జీడి మొక్కలకు పాతప్లాస్టిక్‌ బాటిళ్ల ద్వారా డ్రిప్‌ విధానంలో నీరందిస్తున్నారు. రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
సాగులో సత్ఫలితాలే లక్ష్యం- పాలక ప్రసాదరావు
ప్రభుత్వం ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవాలన్నది నా కోరిక. అందుకే ఉన్న కొద్దిపాటి భూమిలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను. భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధించటమే లక్ష్యం. 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు