గుప్తనిధుల కలకలం

30 Aug, 2017 12:43 IST|Sakshi
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసిన ప్రదేశం

గోపాల్‌పూర్‌ శివారులో గుప్తనిధుల తవ్వకాలు
జలతోపాటు ఓ మూగజీవాన్ని బలిచ్చిన దుండగులు
వారం రోజులుగా తతంగం భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు


ఎల్కతుర్తి (హుస్నాబాద్‌):
కష్టపడకుండా డబ్బు వస్తుందనుకున్న దుండగులు పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకు మూగజీవాలను సైతం బలిస్తున్నారు. మిగిలిన అవశేషాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి సంఘటనే మండలంలోని గోపాల్‌పూర్‌ శివారులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పూర్‌ గ్రామ శివారులో పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆనవాళ్లు ఉండగా ఆ గుట్టను గుడిబండ అని పిలుచుకుంటామని, ఆలయంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కొన్నేళ్ల క్రితమే మాయమైనట్లు గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటున్నారు. కాగా, ఆ ఆలయం ఉన్న గుట్ట కింది భాగంలో ఉన్న ఓ పెద్ద బండరాయి కిందుగా గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.

గుప్త నిధులను పొందేందుకు ఏదైన మూగజీవాన్ని బలివ్వాలనే కారణంతో కంచర్ల వీరస్వామి అనే రైతుకు చెందిన కోల్యాగను బలిచ్చి, దాని రక్తాన్ని పూజలో వాడుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, మరుసటి రోజు ఆ రైతు పొలం వద్దకు వచ్చి చూసే సరికి కోల్యాగ చనిపోయి ఉంది. దీంతో ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చేప్పి ఏదైన విషపురుగు కరిచిందేమోనని భావించి అక్కడే ఖననం చేశారు. తర్వాత వారికి పక్కనే పూజలు చేసిన ప్రదేశం కనిపించడంతో గుప్తనిధు ల కోసమే తమ మూగజీవా న్ని బలిచ్చి ఉంటారని బాధితులు భావిస్తున్నారు.

గుప్తనిధులు దొరికాయా, లేదా.?
సుమారు వారం రోజులుగా ఈ తతంగం జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కోల్యాగ చనిపోవడం, తవ్వకాలు, పూజలు కనిపించడంతో గుప్తనిధుల కోసమే ఈ తతంగమంతా జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, తవ్విన ప్రదేశంలో గుప్తనిధులు దొరికాయా? లేక ఇంకా తవ్వకాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేక తస్కరించుకుని వెళ్లారా? అనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

భయాందోళనలో రైతులు..
తమ పంట పొలాలకు ఎలాంటి భయం లేకుండా వెళ్లే రైతులకు దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారనే సమాచారంతో ఆ చుట్టుపక్కల ఉండే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని బయటపెడితే తమకేమైన హాని తలపెడుతారేమోనని జంకుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించని గుప్త నిధుల వేట ఎల్కతుర్తి మండలంలో చోటు చేసుకోవడంతో మండలంలో కలకలం రేగింది. ఈ విషయం ఈనోట ఆనోట పోలీసులకు తెలిసింది. గుప్తనిధుల కోసం వచ్చి పూజలు చేసిన దుండగులను పట్టుకుంటారా.? రైతుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు