హైకోర్టును ఆశ్రయించిన భూనిర్వాసితులు

12 Aug, 2016 21:20 IST|Sakshi
హైకోర్టును ఆశ్రయించిన భూనిర్వాసితులు
  • 123 జీవో రద్దు చేయాలి
  • 2013 చట్టం వర్తింపజేయాలి
  • రిట్‌పిటిషన్‌ వేసిన గౌరవెల్లి నిర్వాసితులు
  • కొనసాగుతున్న దీక్షలు
  •  హుస్నాబాద్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని గౌరవెల్లి రిజర్వాయర్‌ భూనిర్వాసితులు 32 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి వేసారిన బాధితులు ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 123 జీవోను రద్దు చేయాలని, 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ దాదాపు 8 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గుడాటిపల్లెకు చెందిన గుర్రం రాజిరెడ్డి, బద్దం మల్లారెడ్డి, కొత్త మోహన్‌రెడ్డి, బొజ్జపురి రాజు,  గంభీరపు వివేకానందు( గౌరవెల్లి సర్పంచ్‌), అంగేటి చంద్రారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, కుంట తిరుపతిరెడ్డి 25 మంది నిర్వాసితులతో కలిసి గురువారం హైకోర్టులో రిట్‌ వేశారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంచొద్దని, 2013 భూ సేకరణ చట్టం వర్తింపజేయాలని వేర్వేరుగా  రెండు పిటిషన్లు వేశారు. 18 ఏళ్లు దాటిన చదువుకున్న పిల్లలకు ఉద్యోగం, ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే 2200 ఎకరాలు సేకరించిందని, ప్రాజెక్టు ఎత్తు పెంచితే మరో 1800 ఎకరాలు అవసరమని తెలిపారు. తొలి దశలో ఎకరాకు రూ.2.10లక్షల పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించలేదని, ఇంకా 80 మందికి పరిహారం రావాల్సి ఉందని, ఇళ్ల అడుగుస్థలం దాదాపు 350 ఎకరాలకు పరిహారం అందలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలిదశ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండానే రెండో దశకు సేకరిస్తే అంగీకరించలేదని స్పష్టం చేశారు.

    అన్ని పక్షాలు ఏకమై..
    గౌరవెల్లి భూనిర్వాసితులకు మద్దతుగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి.  రిటైర్డు జస్టిస్‌ చంద్రకుమార్‌ సైతం నిర్వాసితలకు సంఘీభావం తెలిపారు. సీపీఎం పాదయాత్ర, సీపీఐ కలెక్టరేట్‌ ముట్టడి, కాంగ్రెస్‌ ఆందోళనలు, వంటావార్పు, బీజేపీ భరోసాయాత్ర, రెడ్డి సంక్షేమ సంఘం 24 గంటల దీక్షలు ఇలా అన్ని వర్గాలు నిర్వాసితులకు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే మల్లన్నసాగర్‌ నిర్వాసితులు 123 జీవో రద్దుకు హైకోర్టును ఆశ్రయించారు. గౌరవెల్లి నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం వాదోపవాదనలు విన్న తర్వాత ఈనెల 22కు వాయిదా వేసింది.  2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని త్వరలోనే సీపీఐ తరఫున హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయనున్నట్లు పార్టీ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌ తెలిపారు.

     
    స్పందనే లేకనే..

    – గుర్రం రాజిరెడ్డి, నిర్వాసితుడు, గుడాటిపల్లె

    భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అందుకే హైకోర్టులో పిటిషన్‌ వేశాం. ఏడేళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్నాం. తొలిసారి భూములు ఇచ్చినప్పుడు ఐఏవై కింద ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇటీవల ఆర్డీవో వచ్చి ప్రతి ఇంటికి కేవలం రూ.50వేలు ఇస్తామన్నారు.  
     


    న్యాయం దక్కే వరకూ..

    – కొత్త మోహన్‌రెడ్డి, నిర్వాసితుడు, గుడాటిపల్లె
    మాకు న్యాయం దక్కే వరకు పోరాడుతాం. 123 జీవో రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేశాం. కోర్టు తీర్పు ద్వారా మాకు న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఇన్ని రోజులు ప్రభుత్వం చెబితే విన్నాం.. కానీ మా మాటను వింటలేదు. భూ సేకరణ  2013 చట్టం ప్రకారం పరిహారం వచ్చే దాకా పోరాడుతాం.  

     

>
మరిన్ని వార్తలు