నిర్లక్ష్యం వహిస్తే కొంప ‘కొల్లేరే’

28 Feb, 2016 12:22 IST|Sakshi
నిర్లక్ష్యం వహిస్తే కొంప ‘కొల్లేరే’

‘జియో స్పేషియల్ టెక్నాలజీస్, వెట్‌లాండ్ మేనేజ్‌మెంట్’ సదస్సులో నిపుణులు
 
ఏయూ క్యాంపస్(విశాఖపట్నం): కొల్లేరు సరసును పూర్తిస్థాయిలో సంరక్షించే చర్యలు చేపట్టాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం నుంచి ప్రారంభమైన ‘జియో స్పేషియల్ టెక్నాలజీస్, వెట్‌లాండ్ మేనేజ్‌మెంట్’ సదస్సులో భాగంగా శుక్రవారం చర్చావేదిక నిర్వహించారు. కొల్లేరు భౌగోళిక,  జీవ, వృక్ష, సామాజిక సంబంధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, భూగర్భ జలశాఖ, ఈపీటీఆర్‌ఐ, ఆంధ్ర విశ్వవిద్యాలయం తదితర సంస్థలు సుమారు నాలుగన్నరేళ్లుగా సంయుక్త అధ్యయనం చేశాయి.

సాంకేతిక విశ్లేషణ కోసం వర్సిటీలో అనలిటికల్ సెంటర్ ఏర్పాటు చేశారు. నీటిలో ఉండే రసాయనిక మూలకాలను గుర్తించి విశ్లేషించే పరికరాలు కొల్లేరులో ఉంచారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలను నిపుణులు వెల్లడించారు. గతంలో వెయ్యి చ.కిమీ ఉన్న కొల్లేరు ప్రస్తుతం 270 చ.కిమీకు తగ్గిందని, దీన్ని రెట్టింపు చేయాలని చెప్పారు. ఇక్కడి జీవ వైవిధ్య రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

నానాటికీ క్షీణిస్తున్న నీటి నాణ్యతను సంరక్షించాలని, చేపల చెరువులుగా వినియోగిస్తున్న ప్రాంతాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. ‘స్ట్రెయిట్ కట్’ నిర్మాణంతో సరస్సులోకి రెండు దారుల నుంచి వస్తున్న ఉప్పు నీటిని నియంత్రించాలన్నారు. సరస్సులో ఆక్రమణల కారణంగా వర్షపు నీరు నేరుగా సరస్సులోకి చేరడం లేదని, దీంతో పెద్దవర్షాలు పడినపుడు ఏలూరు మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
 
ప్రభుత్వానికి నివేదిస్తాం...
 కొల్లేరుపై అధ్యయనం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ ఆచార్య పి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎంతో జీవవైవిధ్యం కలిగిన కొల్లేరును సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

ఇతర ప్రాంతాలపై ప్రభావం..
కొల్లేరులో 168 పక్షిజాతులు, 68 నీటి వృక్షాలు, 120 రకాల చేపలను గుర్తించామని కృష్ణా వర్సిటీ మాజీ వీసీ ఆచార్య దుర్గాప్రసాద్ పేర్కొ న్నారు.. ఇంతటి జీవవైవిధ్యం కలిగిన ప్రాంతాన్ని రక్షించుకోకపోతే కలిగే పరిణామాలు ఇతర ప్రాంతాలపై పడే అవకాశముందన్నారు.

మరిన్ని వార్తలు