‘సన్న’గా దోపిడీ

19 Oct, 2016 22:32 IST|Sakshi
‘సన్న’గా దోపిడీ
• అక్రమాలతోనే సన్న బియ్యం సేకరణకు శ్రీకారం
• పక్షం రోజుల నుంచే ప్రారంభమైన సరఫరా ప్రక్రియ
• టాస్క్‌ఫోర్స్‌ దాడిలో వెలుగులోకి బాగోతం
సాక్షి, నిజామాబాద్‌ :
సన్న బియ్యం(పీవీఆర్‌) సేకరణ ప్రక్రియ అక్రమాలతోనే శ్రీకారం చుట్టినట్లయింది. ఈ రకం బియ్యం సరఫరాలో ఆరంభం నుంచే బియ్యం కల్తీ వెలుగు చూస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సన్న బియ్యం సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్న జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి గణపతి రైసుమిల్లరు సన్న బియ్యంలో కల్తీ చేస్తున్నట్లు మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూసింది. చిన్నారులకు ఆరోగ్యానికి హాని చేసే సీడ్‌ కంపెనీలకు చెందిన బియ్యాన్ని పౌర సరఫరా శాఖకు సరఫరా చేసే బియ్యంలో కల్తీ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సన్న బియ్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న ఈ మిల్లరు సరఫరా ఆరంభం నుంచే నాణ్యత లేని బియ్యాన్ని సర్కారుకు అట్టగట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే 20 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరా శాఖ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాముకు సరఫరా చేయగా.. అవి కూడా నాణ్యత లోపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనరేట్‌కు నివేదిక ఇచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారులు పేరొంటున్నారు.
పక్షం రోజుల క్రితమే షురువైన సేకరణ ప్రక్రియ
ప్రభుత్వం పాఠశాలలు, వసతిగృహాల్లో చదివే నిరుపేద విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో భోజనం వడ్డించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఈ సన్న బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టింది. గతేడాది జిల్లాలోనే ఈ బియ్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టగా భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి పౌరసరఫరా శాఖ కమిషనరేట్‌ నుంచే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం టెండరు ప్రక్రియ నిర్వహించింది. క్వింటాళుకు రూ.3,850 చొప్పున సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకున్నారు. జిల్లాకు ఈ సన్నబియ్యం సరఫరా చేసే కాంట్రాక్టు ఈ వరలక్ష్మి రైసుమిల్లుతోపాటు, హైదరాబాద్‌కు చెందిన మరో మిల్లరుకు ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయం అప్పగించింది. పక్షం రోజుల క్రితం నుంచి ఈ సన్న బియ్యం సరఫరా మెుదలైంది. సెప్టెంబర్‌ 29న కమిషనరేట్‌ నుంచి మూమెంట్‌ ఆర్డర్‌ వచ్చింది. ఇంతలోనే ఈ అక్రమం వెలుగు చూడటం గమనార్హం.
ప్రతినెలా 1,170 టన్నులు అవసరం
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 2,175 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సుమారు 2.10 లక్షల మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వడ్డిస్తున్నారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో కూడిన భోజనం పెడుతున్నారు. ఇందుకోసం ప్రతినెల సుమారు 1,170 టన్నుల సన్న బియ్యం అవసరమని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ సన్న బియ్యాన్ని సేకరిస్తున్నారు.
మిల్లరుపై 6 ఏ కేసు : కృష్ణప్రసాద్, డీఎస్‌ఓ 
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలపై 6ఏ కేసు నమోదు చేశాం. ఈ మేరకు అక్కడ సేకరించిన బియ్యం శాంపిళ్లను కమిషనరేట్‌ ల్యాబ్‌కు పంపాం. ల్యాబ్‌ రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటాం.
 
మరిన్ని వార్తలు