బయట పడ్డ ‘పేలుడు’ పాతర

11 May, 2017 23:40 IST|Sakshi
బయట పడ్డ ‘పేలుడు’ పాతర
బాంబ్‌ డిజ్పోజబుల్‌ స్క్వాడ్‌ వెలికితీత
వందేసి చొప్పున డిటోనేటర్లు, పవర్‌ జెల్స్‌ స్వాధీనం 
అడ్డతీగల : గ్రామ శివారులోని ప్రధాన రహదారి చెంత పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలను వెలికితీశారు. ఒక గోతిలో దొరికిన ఒక ప్లాస్టిక్‌ టబ్బు.. అందులో ఉన్న సంచిలో 25 కిలోల బరువైన వంద డిటోనేటర్లు, మరో వంద పవర్‌ జెల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి వచ్చిన అత్యంత రహస్య సమాచారం మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్మామ్‌ నయూం అస్మి ఆధ్వర్యంలో బాంబ్‌ డిస్పోజబుల్‌ స్క్వాడ్‌, ఇతర పోలీసులు అడ్డతీగల శివారున అడవుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దొరికిన ఈ టబ్బుకి ఏమైనా ఎలక్ట్రిక్‌ వైర్లు అమర్చారా? అంటూ నిశితంగా పరిశీలించి తరువాతే దానిని బయటకు తీశారు. ఎక్కడో విధ్వంసం సృష్టించేందుకే వీటిని ఇక్కడ భద్రపర్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 
ఏడేళ్ళ క్రితం కోనలోవ వద్ద ఓ కల్వర్టు కింద అమర్చిన 35 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత పేలుడు పదార్ధాలు దొరకడం ఇదే ప్రథమం.
దర్యాప్తు చేస్తాం : ఏఎస్పీ అస్మి
అడ్డతీగల శివారున పేలుడు పదార్ధాలు బయటపడిన విషయంపై కేసు దర్యాప్తు చేస్తామని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్‌ నయూం అస్మి తెలిపారు. తనిఖీల్లో బయటపడిన పేలుడు పదార్ధాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో సమాచారంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టి వీటిని కనుగొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు క్వారీ నిర్వాహుకులకు చెందినవా? లేక మావోయిస్టులు ఇక్కడ ఉంచారా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు.
మరిన్ని వార్తలు