ఆరిన ‘మణి’దీపం

26 Jan, 2017 00:09 IST|Sakshi
ఆరిన ‘మణి’దీపం
- ప్రేమ పేరుతో వేధింపులు
- మనస్తాపంతో విద్యార్థిని 
  బలవన్మరణం
- లింగాలలో విషాదం
 
కోవెలకుంట్ల: ప్రేమ వేధింపులు ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నాయి. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన ఆశల దీపం ఆరిపోయింది. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామానికి చెందిన యన్నం నాగమణి(17) అనే నర్సింగ్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యు) విద్యార్థిని  బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు, రేవనూరు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ అందించిన సమాచారం మేరకు వివరాలు ఇవి.. గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, మాణిక్యమ్మ దంపతులకు నాగమణి,  సుబ్రమణ్యం సంతానం. ఉండటానికి ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.  వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్తూ.. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నర్సింగ్‌ కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది.
 
గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి గుండుపాపల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కి కళాశాలకు చేరుకుంటోంది. దొర్నిపాడు మండలం డబ్ల్యు గోవిందిన్నెకు చెందిన ప్రశాంత్‌ అనే విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ బీకాం కంప్యూటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజు నాణమణి వెళ్తున్న బస్సులో కలుగొట్ల వద్ద ఎక్కి పట్టణానికి చేరుకునే వాడు. ఈ క్రమంలో నాగమణిని ప్రేమించాలంటూ   వేధించేవాడు. బాగా చదువుకుని ప్రయోజకురాలు కావాలనేది తన లక్ష్యమని, ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టవద్దని పలుమాల్లు ఆ విద్యార్థిని తెలియజేసినా పట్టించుకోకుండా ఒత్తిడి చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు.
 
ఆ విద్యార్థిని ఈ విషయాన్ని ఇంట్లో చెప్పుకోలేక అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లలేక కొన్ని రోజుల నుంచి తీవ్ర మనోవేదన చెందుతోంది. రోజులాగే మంగళవారం ఉదయం బస్సులో ప్రశాంత్‌ వేధింపులు కొనసాగించాడు. దీంతో  అదేరోజు సాయంత్రం ఇంటికి వెళ్లి మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆమె క్రిమి సంహారక గుళికలు మింగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. కుమార్తె మృతి చెందటంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రశాంత్‌పై 306 సెక‌్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు