ఇక్కారెడ్డిగూడలో నేత్రదానం

26 Mar, 2016 02:06 IST|Sakshi
ఇక్కారెడ్డిగూడలో నేత్రదానం

చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో చనిపోయిన ఓ వ్యక్తి నేత్రాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆరు నెలల క్రితం గ్రామంలో 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి అంగీకారప్రతాలను ఇచ్చారు.చేవెళ్ల రూరల్ : నేత్రదాన అంగీకర ప్రతాలను ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు మండలంలోని చనువెళ్లి అనుబంధ గ్రామమైన ఇక్కారెడ్డిగూడ గ్రామస్తులు. గురువారం గ్రామానికి చెందిన అనుపురం శ్రీనివాస్ (35) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆయన క ళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు.

ఇదిలా ఉండగా.. ఆరు నెలల కిత్రం 2015 సెప్టెంబర్ 6వ తేదీన మండలంలోని ఇక్కారెడ్డిగూడలోని గ్రామస్తులు 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి నేత్రదాన అంగీకరప్రతాలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులంతా నేత్రదాన అంగీకార పత్రాలను అందించిన సమయంలో మృతుడు కూడా ఇచ్చాడు. దీంతో గురువారం సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది గ్రామానికి చేరుకుని కళ్లను సేకరించారు. అంగీకార పత్రాలు ఇచ్చిన ఐదు నెలల కాలంలో.. గ్రామానికి చెందిన  రుక్కమ్మ చనిపోవడంతో ఆమె నేత్రాలను అందించి ఇక్కారెడ్డిగూడలో మొదటి నేత్రదాతగా నిలిచారు.

ఇది జరిగిన 15 రోజులకే గ్రామానికి చెందిన చిరుమోని హనుమంతరెడ్డి చనిపోవడంతో ఆయన నేత్రాలను దానం చేయడంతో రెండో దాతగా నిలువగా ప్రస్తుతం విద్యుదాఘాతంతో మృతిచెందిన అనుపురం శ్రీనివాస్ మూడో నేత్రదాతగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఎవరు చనిపోయినా వారి నేత్రాలను ఆస్పత్రి వారికి అందిస్తామని గ్రామ యువజన సంఘం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి (రాజు) తెలిపారు.

>
మరిన్ని వార్తలు