ఇసుక మాఫియాను రాజకీయంగానే ఎదుర్కొంటాం

30 Jul, 2016 00:30 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న జెడ్పీటీసీ సూర్యబాబుగౌడ్‌
– బ్రిడ్జి పనులు జరగడమే మాకు ముఖ్యం : జెడ్పీటీసీ సూర్యబాబుగౌడ్‌ 
– ఇసుక మాఫియా నుంచి ప్రాణహాని ఉంది : బ్రిడ్జి కంట్రాక్టర్‌ 
అలంపూర్‌రూరల్‌ : అలంపూర్‌ తుంగభద్రా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జరగనీయకుండా పిల్లర్ల కింద ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్న వైనంపై శుక్రవారం ‘తుంగభద్రను తోడేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అలంపూర్‌లో రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను, అడ్డుకునేందుకే కొందరు ఇక్కడి పిల్లర్ల కింద నుంచి ఇసుకను తవ్వి తరలిస్తున్నారని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు. దీంతో స్థానిక జెడ్పీటీసీ సూర్యబాబుగౌడ్, ఎంపీపీ శంషాద్‌ భర్త ఇస్మాయిల్, బ్రిడ్జి కాంట్రాక్టర్‌ నాగార్జునతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కింద ప్రారంభించిన ఈ పనులకు ఇసుక మాఫియా అడ్డుతగులుతోందని జెడ్పీటీసీ సూర్యబాబుగౌడ్‌ ఆరోపించారు. దీనివల్ల బ్రిడ్జి నిర్మాణ పరికరాలు కూడా ఇసుకలో మునిగిపోయాయని అన్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై ఇక రాజకీయంగానే బుద్ధి చెబుతామని అన్నారు. అనంతరం ఎంపీపీ భర్త ఇస్మాయిల్‌ మాట్లాడుతూ అప్పటి ఎమ్మెల్యే చల్లావెంకటరామిరెడ్డి హయాంలో వారి అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.35కోట్లు కేటాయించారని అన్నారు. ఈకార్యక్రమంలో కాశీపురం గ్రామ సర్పంచ్‌ దివాకర్‌గౌడ్, ఇస్మాయిల్, జిల్లెలపాడు శేఖర్, శ్రీకాంత్‌గౌడ్‌ ఉన్నారు. 
నాకు ప్రాణహాని ఉంది 
– నాగార్జున, బ్రిడ్జి కాంట్రాక్టర్‌ 
బ్రిడ్జి పనులు జరగనీయకుండా ఇసుక మాఫియా అడ్డుకుంటోంది. పిల్లర్ల కింద ఉన్న ఇసుకను కూడా తొవ్వుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే స్థానిక ఎస్‌ఐ ముందే తనపై దాడికి దిగారు. దీంతో ఎస్‌ఐ నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. చంపుతామని బెదిరిస్తున్నారు. అందువల్లే పనులు చేయలేకపోతున్నా. 
మరిన్ని వార్తలు