సిబ్బంది జాస్తి.. సౌకర్యాలు నాస్తి

19 May, 2017 23:25 IST|Sakshi
సిబ్బంది జాస్తి.. సౌకర్యాలు నాస్తి

- అనంత పోలీస్‌స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువు
- సిబ్బందికే కాదు.. ఎస్‌ఐలదీ అదే పరిస్థితి
- రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుకుల మధ్య ఓ ఎస్‌ఐ


        ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం అనంతపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌. ఇందులో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు,  హోంగార్డులు పని చేస్తున్నారు. డీఎస్పీకి, ఓ ఎస్‌ఐకు మాత్రమే చిన్నపాటి గదులు ఉన్నాయి. మిగిలిన వారు కనీసం కుర్చీ వేసుకునేందుకు కూడా వీల్లేదు. అనేక మంది ఎస్‌ఐలు అవసరమైనప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రావడం, నిలబడే విధులు నిర్వహించి వెళ్లడం పరిపాటిగా మారింది. వాహనాలదీ అదే సమస్య. డీఎస్పీకి ఒక వాహనం, మిగిలిన ఎస్‌ఐలందరికీ మరో వాహనం ఉంది. ఒకరు వాహనం తీసుకుని వెళ్తే మిగిలిన వారు బైక్‌లపై వెళ్లి  విధులు నిర్వర్తించాల్సిందే.  మిగతా పోలీస్‌ స్టేషన్లలోనూ అదే పరిస్థితి. ఎస్‌ఐ స్థాయి అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక కానిస్టేబుల్, హోంగార్డుల గురించి చెప్పనక్కర లేదు.

అనంతపురం సెంట్రల్‌ : అనంతుపరం పోలీస్‌స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలే కాదు.. అధికారులు, సిబ్బందికీ కనీస సౌకర్యాలు లేవు. ఎస్‌ఐలకు కూడా కనీస వసతరులు  కల్పించకపోవడం విడ్డూరంగా ఉంది. అంతో ఇంతో వన్‌ టౌన్, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్లు మినహాయిస్తే, మిగిలిన వాటిలో ఎస్‌ఐలకు చాంబర్లు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐదు మంది ఎస్‌ఐలు ఉన్నారు. ఒకప్పటి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో, ప్రస్తుతం పోలీసు స్టేషన్‌ నిర్వహిస్తున్నారు. ఏమాత్రం సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు.

నూతన భవనం పనులు ప్రారంభమైనా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అంతుబట్టడం లేదు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మరి దారుణం. పూరతన భవనంలో,  ఇరుకు గదిలో ఇద్దరు ఎస్‌ఐలు పని చేస్తున్నారు. టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ షెడ్‌ను ఎస్‌ఐ శుభ్రం చేసుకొని వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎండలకు అందులో కూర్చునేందుకు కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.  చాంబర్‌ల కొరతతో పాటు మరుగుదొడ్ల సమస్య కూడా ఎక్కువుగా ఉంది. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో మరుగుదొడ్డి మాత్రమే ఉంది. అధికారులు, సిబ్బంది వాటినే వినియోగించుకుంటున్నారు. సమస్యలపై వచ్చే ప్రజలకు మాత్రం ఎక్కడా అనుమతుల్లేవు. దీంతో పరిసరాలను చూసుకోవాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు