అమడగూరులో కలకలం

20 Mar, 2017 00:01 IST|Sakshi
అమడగూరులో కలకలం

- పట్టపగలు వ్యక్తిపై వేటకొడవలితో దాడి చేసి హత్యాయత్నం
- భయభ్రాంతులకు గురైన జనం
- మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరుకు తరలింపు


అమడగూరు : ఆదివారం.. అందునా వారపు సంత.. ఆ ప్రాంతమంతా జనసంచారంతో నిండిపోయింది. అంతలోనే ఓ వ్యక్తిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేయడం.. బాధితుడితో పాటు జనాలు తేరుకునేలోగానే నిందితుడు అక్కడి నుంచి మాయం కావడం..అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన అమడగూరులో వెలుగు చూసింది.

ఎలా జరిగిందంటే..
మండలంలోని గంగిరెడ్డిపల్లికి చెందిన డేగాని మారపరెడ్డి ఇంటికి కావాల్సిన సరుకుల కోసం అమడగూరుకు వచ్చారు. అక్కడి ఓ కిరాణా కొట్టులో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో బైక్‌ను స్టార్ట్‌ చేస్తుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన అదే మండలం కొత్తపల్లికి చెందిన వేమనారి వేట కొడవలితో మారపరెడ్డి తలపై మూడుసార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తరువాత ఎవరికీ చిక్కకుండా పారిపోయాడు.

చొరవ చూపిన జనం
తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిన మారపరెడ్డిని స్థానికులు ప్రథమ చికిత్స అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం జరిగి, తలపై రెండు లోతైన గాయాలు కావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు సెంట్‌జాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. కాగా హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ చలపతి తెలిపారు.  
అదుపులో నిందితుడు..?
మారపరెడ్డిపై వేట కొడవలితో హత్యాయత్నం చేసిన వేమనారి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. దాడి చేసిన వెంటనే నిందితుడు దేవగుడి చెరువు మీదుగా వెళ్లి కొత్తగా నిర్మిస్తున్న సాయిబాబా ఆలయ సమీపంలో దాక్కొని ఉండటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా