మేత లేక.. మేప లేక..

28 May, 2016 00:30 IST|Sakshi
మేత లేక.. మేప లేక..

కరువు కాటుకు పశువులు విలవిల
దొరకని పశుగ్రాసం.. పెరిగిన గడ్డి ధర
మేపలేక అమ్మకానికి మొగ్గు
కొనుగోలు చేసేవారూ కరువు
దక్కని ప్రభుత్వ చేయూత ఆందోళనలో రైతాంగం

కరువు ధాటికి గొడ్డూగోదా విలవిల... రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు, కుంటలు... వట్టిపోయిన బోర్లు.. వరిసాగు లేక పశు గ్రాసం కరువు... పంటలు లేక కూలీలుగా మారిన రైతులు. పూటగడవడమే కష్టం... పశువులను మేపే పరిస్థితి లేదు. గ్రాసం అందక ప్రాణాలు పోయే పరిస్థితిలో పశువులు. వాటి  గోస చూడలేక అమ్మేందుకు మొగ్గు చూపుతున్న దుస్థితి...  అటు పశువులను కొనే వారూ కరువు... వాటిని మేపలేక..  అమ్మలేక తల్లడిల్లుతున్న రైతులు.. సర్కార్ చేయూత లేక దయనీయ స్థితిలో అన్నదాతలు. - నర్సాపూర్

గ్రాసం పెట్టలేక అమ్ముకుంటున్నా...
నాకు ఆరెకరాల పొలం ఉంది. కరువుతో బోరు ఎండి వ్యవసాయం సాగడం లేదు. పొట్టకూటి కోసం ఉపాధి పనులకు పోతున్నాం. గడ్డి ధరలు కూడా పెరిగాయి. కొనుగోలు చేసి పశువులకు గడ్డి పెట్టే పరిస్థితి లేదు. తూర్పు కోడెలను అమ్మేందుకు నర్సాపూర్ అంగడికి తీసుకుపోతున్నా. మూడు గేదెలు ఉన్నాయి. వాటికీ గ్రాసం పెట్టనందున పాలు తక్కువ ఇస్తున్నా యి. ఎంతో ప్రేమతో పెంచుకు న్న ఎడ్లను అమ్మాల్సి వస్తుం ది. గతంలో సరైన ధర రాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రయత్ని స్తున్నా.  - అర్జున్, హత్నూర

కరువు ప్రభావం పాడి పశువులపైనా పడింది. కరువు పరిస్థితులు రోజురోజుకు రైతన్నలను కుంగదీస్తున్నాయి. రైతులు తమ ప్రాణపదంగా పెంచుకునే పశువులకు సరిపడా పశుగ్రాసం పెట్టలేకపోతున్నారు. వాటి గోసను చూడలేక అమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా అంగట్లో విక్రయానికొచ్చిన పశువులే కన్పిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక... బోర్లు ఎండిపోవడంతో పంటలు పండలేదు. అదే సమయంలో పశువులకు గడ్డి సైతం దొరకని పరిస్థితి. ఒకప్పుడు బక్కచిక్కిన, వ్యవసాయ పనులకు పనికిరాని పశువులనే అంగట్లో అమ్మేవారు. తాజాగా పశువులకు మేత, నీటిని అందించే పరిస్థితి లేక రైతులు  అమ్ముకుంటున్నారు. నర్సాపూర్ సంతకు జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు తూర్పు కోడెలు, పడమట కోడెలతోపాటు చిన్న వయస్సులో ఉన్న కోడెలను, ఇతర ఎడ్లను అమ్మేందుకు తీసుకొస్తున్నారు. 

గడ్డి కూడా భారమే...
గడ్డి ధర విపరీతంగా పెరిగిందని, గడ్డి మోపు ధర రూ.వంద నుంచి రూ.125 వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. గడ్డి కొనలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. వరి సాగు చేయనందున గడ్డి కరువైందని, అందుకే ధర విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ధర పెరిగినా ప్రభుత్వం నుంచి పశుగ్రాసం సరఫరా చేసే విషయంలో తమకు ఎలాంటి మద్దతు లభించడం లేదని అంటున్నారు.

తాము తినడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రాణపదంగా చూసుకునే పశువులకు గడ్డి, ఇతర గ్రాసం పెట్టలేకపోతున్నామని కన్నీరు కారుస్తున్నారు. వాటిని చంపుకోలేక అమ్ముకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. కాగా పశువులను పోషించే స్థోమత లేక కొందరు రైతులు ఆరోగ్యంగా ఉన్న పశువులను సైతం అంగడికి తరలిస్తున్నారు. అంతటా కరవు ఉన్నందున వ్యవసాయం సాగక పశువుల వినియోగం తగ్గడం వల్ల వాటిని కొనేవారు కరువయ్యారు.

మరిన్ని వార్తలు