సీబీఐ అధికారినంటూ మోసాలు..

17 Jul, 2016 00:23 IST|Sakshi
సీబీఐ అధికారినంటూ మోసాలు..

నలుగురు అరెస్ట్
 
సంతోష్‌నగర్: తాను సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన ముగ్గురిని సంతోష్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సంతోష్‌నగర్ ఏసీపీ వి. శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్‌తో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. బళ్లారి చౌల్‌బజార్‌కు చెందిన హులిరాజ్ గౌడ్ అలియాస్ సికిందర్ అలీ (51) నగరంలో సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతడికి అంబర్‌పేట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన సయ్యద్ మస్తాన్ అలీ (45), యాకుత్‌పురా సూర్యజంగ్ దేవిడికి చెందిన సయ్యద్ మసూద్ అలీ హష్మీ అలియాస్ నవాజ్ (26), చాంద్రాయణగుట్ట నర్కీ పూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఖాజా పాషా అలియాస్ బాబా (46) సహరిస్తున్నారు. కాగా సంతోష్‌నగర్‌కు చెందిన సయ్యద్ నజఫ్ మొహీనుద్దీన్(82)కు బాలాపూర్‌లో ఉన్న ప్లాట్‌పై వివాదం కొనసాగుతోంది.


విషయం తెలుసుకున్న సికిందర్ అలీ తాను సీబీఐ డిప్యూటీ డెరైక్టర్‌నని, ఢిల్లీ నుంచి వచ్చానని మొహీనుద్దీన్‌ను నమ్మించాడు. వివాదాన్ని పరిష్కరిస్తానని రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడు. జరిగిన విషయంపై బాధితుడు సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, నయాపూల్‌లో ఉన్న నిందితులను పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేసి సికిందర్ అలీతో పాటు అతనికి సహకరించిన సయ్యద్ మస్తాన్ అలీ, సయ్యద్ మసూద్ అలీ హష్మీ, మహ్మద్ ఖాజా పాషాను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు