దొంగనోట్ల ముఠా అరెస్టు

20 Feb, 2017 23:48 IST|Sakshi
దొంగనోట్ల ముఠా అరెస్టు
- చిరు వ్యాపారుల లక్ష్యంగా చెలామణి
- రూ.2,17,100 విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం
- నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడు
 
కర్నూలు: కర్నూలు నగర శివారుల్లోని జొహరాపురం హౌసింగ్‌బోర్డు కాలనీలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నూలులోని వివిధ దుకాణాల్లో చెలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠా సభ్యులు దారం సునీల్, వలతాటి తారాకుమార్, పసుల శ్రీనివాసరెడ్డి, లొద్దిపల్లె బోయ శివకుమార్‌లను రెండో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,17,100 విలువ చేసే రూ.2000, రూ.500, రూ.100 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు.
 
నిందితుల్లో సునీల్‌ పాత నేరస్తుడు. 2012లో తాను కానిస్టేబుల్‌ను అంటూ ఎస్‌ఐ ఇంటికి వెళ్లి మహిళలను కత్తితో బెదిరించి చోరీకి పాల్పడ్డాడు. బంగారు, నగదు మూటకట్టుకొని ఉడాయించారు. 2013లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆరు మాసాల పాటు జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటికి వచ్చాడు. రంగారెడ్డి జిల్లా తాండూరులో కొంతకాలం పాటు పాలిస్‌బండల కటింగ్‌ ఫ్యాక్టరీలో పని చేశాడు. అక్కడ పద్మ అనే మహిళతో పరిచయం పెరిగి పెళ్లి చేసుకొని, మళ్లీ కర్నూలుకు మకాం మార్చాడు. ఈ నేపథ్యంలో తారాకుమార్, శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌లతో పరిచయం ఏర్పడింది. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. డిసెంబరు నెలలో కలర్‌ జిరాక్సు మిషన్‌ కొని జొహరాపురం శివారుల్లోని హౌసింగ్‌బోర్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ నోట్లను తయారు చేశారు. రూ.60 వేలు తయారు చేసి చెలామణి చేసుకు రమ్మని సునీల్‌ తారాకుమార్‌కు అప్పగించాడు.
 
ఇలా బయటపడింది..
కర్నూలు నగరంలోని ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించే వారిని ఎంపిక చేసుకొని ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్లను చెలామణి చేశారు. అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌లో ఫుట్‌పాత్‌ బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్లి రూ.2వేల నకిలీ నోటు ఇచ్చి, రూ.200 విలువ చేసే బట్టలు కొనుగోలు చేశారు. ఇలా రెండు రోజులకు ఒకసారి వరుసగా 15 రోజుల పాటు బట్టల వ్యాపారికి నకిలీ నోట్లు కట్టబెట్టి చెలామణి చేశారు. వ్యాపారికి అనుమానం వచ్చి తన సమీప బంధువు కానిస్టేబుల్‌కు వాటిని చూపించగా, నకిలీ నోట్లుగా గుర్తించారు.  
 
మరుసటి రోజు కానిస్టేబుల్‌ దుకాణం వద్దనే మాటు వేసి ఉండగా, ముఠా సభ్యులు అక్కడికి చేరుకొని బట్టలు కొనుగోలు చేసి రూ.2వేల నకిలీ నోటు ఇస్తుండగా, కానిస్టేబుల్‌ వచ్చి వారిని పట్టుకొని మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతం రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండటంతో విచారించి వారికి అప్పగించారు. నేషనల్‌ హోటల్, పెట్రోల్‌బంకుతో పాటు, పలు బట్టల దుకాణాల్లో కూడా నకిలీ నోట్లను మార్పిడి చేసినట్లు ముఠా సభ్యులు విచారణలో అంగీకరించారు. తారాకుమార్, శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌లు పాతబస్టాండు సమీపంలోని సుధాకర్‌రెడ్డి పెట్రోలు బంకు, రైల్వే స్టేషన్‌ దగ్గర్లో ఉన్న ఇమ్రాన్‌ హోటల్, హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్లాట్‌ నెం.19లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నారు.
 
చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తులపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐలు ఖాజావలి, చంద్రశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ కరీంబాషా, కానిస్టేబుళ్లు ఆయూబ్‌ఖాన్, రామాంజనేయులు, వర కుమార్, బి.కృష్ణ తదితరులను ఎస్పీ ఆకె రవికృష్ణ అభినందించారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన జిరాక్స్‌ మిషన్‌తో పాటు ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై చీటింగ్‌ కేసుతో పాటు సస్పెక్ట్‌సీట్స్‌ ప్రారంభించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ శివరామ్‌ప్రసాద్, ఇన్‌చార్జి డీఎస్పీ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. 
 
అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ
జిల్లాలో నకిలీ నోట్ల తయారు చేసే ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ ముఠా సభ్యుల వెనుక ఇంకా ఎవరున్నారు. ఎక్కడెక్కడ చెలామణి చేశారనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త నోట్లను కూడా నకిలీ చేసి ముఠా సభ్యులు చెలామణి చేస్తున్నారు. అలాంటి వారు ఎక్కడ సంచరించినా అనుమానం వచ్చినా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి. అలాంటివారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.  
 
మరిన్ని వార్తలు