నకిలీ ఉద్యోగులు దొరికిపోయారు..!

16 Nov, 2016 20:10 IST|Sakshi
నకిలీ ఉద్యోగులు దొరికిపోయారు..!
* బుధవారం దొరికిన ఇద్దరు మహిళలు 
బయోమెట్రిక్‌ ఉన్నా ఈ పరిస్థితేంటో.. 
ఉద్యోగం చేయకపోయినా జీతాలు ఇస్తున్న వైనం  
 
గుంటూరు మెడికల్‌ : 
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోజురోజుకు నకిలీ ఉద్యోగుల లీలలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులు ప్రతి నెలా వేల రూపాయల జీతాలు తీసుకుంటూ విధులకు హాజరు కావడం లేదు. తమ బదులుగా మరొకరిని ఉద్యోగంలో పెట్టి సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. నకిలీ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నా సంబంధిత అధికారులు తనిఖీలు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11న ఓ ఉద్యోగి తనకు బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ పట్టుబడగా తాజాగా బుధవారం ఇద్దరు మహిళా ఉద్యోగినులు తమ బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ ఆస్పత్రి అధికారులకు దొరికిపోయారు.
 
ఏటీఅగ్రహారానికి చెందిన రాములమ్మ జీజీహెచ్‌లో నాల్గో తరగతి ఉద్యోగినిగా (స్వీపర్‌)గా పనిచేస్తోంది. ఆమె పది నెలలుగా విధులకు హాజరు కాకుండా తన బదులుగా శారద కాలనీ పదో లైనుకు చెందిన అన్నపూర్ణకు నెలకు రూ.5 వేలు ఇచ్చి తన ఉద్యోగాన్ని చేయిస్తోంది. రామిశెట్టి దుర్గాదేవి జీజీహెచ్‌లో నాల్గో తరగతి ఉద్యోగిగా (ఎఫ్‌ఎన్‌ఓ)గా పనిచేస్తూ విధులకు హాజరు కాకుండా తనకు బదులుగా పసుపులేటి ప్రశాంతితో ఉద్యోగం చేయిస్తోంది. ఈ నెల 11న దుర్గం శివయ్య తనకు బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ పట్టుబడడంతో ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ యనమల రమేష్‌ నకిలీ ఉద్యోగులపై దృష్టి సారించారు. బుధవారం విధులకు హాజరవుతున్న ఉద్యోగులను ఆరా తీయగా పసుపులేటి ప్రశాంతి, అన్నపూర్ణ నకిలీ ఉద్యోగులుగా విచారణలో తేలింది. దీంతో తక్షణమే వారిపై పోలీసులకు సమాచారం అందజేసి వారితో ఉద్యోగం చేయిస్తున్న రామిశెట్టి దుర్గాదేవి, రాములమ్మ గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. 
 
అధికారులకు తెలిసే జరుగుతోందా?.. 
జీజీహెచ్‌లో శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మొదులుకొని, కార్యాలయ ఉద్యోగులు, నర్సులు, నాల్గో తరగతి ఉద్యోగులు పారామెడికల్‌ ఉద్యోగులు, అధికారులు అందరికి కూడా బయోమెట్రిక్‌ విధానాన్ని రెండేళ్లుగా అమలు చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్‌ ఉన్నా నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలో ఎలా పనిచేస్తున్నారన్నది విమర్శలకు తావిస్తోంది. అధికారులకు తెలిసే ఈ తంతు జరుగుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రి ఉద్యోగా? బయటి వ్యక్తా? అనే విషయం ప్రతి రోజూ సంబంధిత అధికారుల వద్ద హాజరు పట్టీలో సంతకం పెట్టే సమయంలో లేదా బయోమెట్రిక్‌ వేసే సమయంలో అధికారులకు తెలుస్తుంది. ఏళ్ల  తరబడి నకిలీ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నా అసలు ఉద్యోగులు విధులకు రాకపోయినా వారికి జీతాలు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారుల అండదండలు ఉండటం వల్లే ఇలాంటి నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలో నిర్భయంగా పనిచేస్తున్నారంటూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే తరహాలో పలు వార్డుల్లో నకిలీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పలువురు ఆస్పత్రి ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఆస్పత్రి అధికారులు ఇప్పటికైనా స్పందించి నకిలీల భరతం పట్టి పరువు బజారున పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. 
మరిన్ని వార్తలు