దొంగనోట్ల ముఠా అరెస్టు

26 Nov, 2016 21:52 IST|Sakshi
దొంగనోట్ల ముఠా అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకొని రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎనిమిది సభ్యులు గల ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసి రూ.50వేల నగదు, జిరాక్స్‌ మెషీన్లు, రూ.2,22,310ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో  జాయింట్‌ సీపీ శశిధర్‌ రెడ్డి, ఎస్‌వోటీ ఇన్ స్పెక్టర్‌ నర్సింగ్‌రావులతో కలిసి కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. హత్యకేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇబ్రహీంపట్నానికి చెందిన గణేశ్‌కు నకిలీ కరెన్సీ కేసులో పట్టుబడిన సిరిసిల్లా జిల్లాకు చెందిన అంజయ్యతో పరిచయం ఏర్పడింది.

జైలు నుంచి విడుదలైన తర్వాత అతను తన మిత్రుడు సాయినాథ్‌తో కలిసి దొంగనోట్లు తెచ్చుకునేందుకు సిరిసిల్లా జిల్లా వెంకటపూర్‌ గ్రామానికి వెళ్లాడు. అంజయ్య లేకపోవడంతో అతని స్నేహితుడు సత్యం సూచన మేరకు నిజామాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌ను కలిశాడు. అసలు కరెన్సీకి మూడింతలు నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్న శ్రీకాంత్‌ సాయినాథ్‌ నుంచి రూ.2,90,000 తీసుకున్నాడు. అనుకున్న సమయానికి అతను దొంగ నోట్లు ఇవ్వ లేకపోవడంతో  ఈ ఏడాది జనవరి 10న అంజయ్యను కలిసి రూ.లక్ష ఇచ్చాడు.

నకిలీ కరెన్సీ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని చెప్పడంతో ఈ విషయాన్ని సాయినాథ్‌ సిరిసిల్లా జిల్లా పెద్దూర్‌కు చెందిన చీకోటి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో అతను తన మిత్రులు విజయ్‌కుమార్, కళ్యాణ్‌లను పరిచయం చేశాడు. వారు సికింద్రాబాద్‌లో ఒక కలర్‌ జిరాక్స్‌ మెషీన్ ను కొనుగోలు చేసి సిరిసిల్లలో నకిలీ కరెన్సీ ముద్రించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమ మిత్రుడైన కొహెడకు చెందిన శ్రీధర్‌ గౌడ్‌తో కలిసి మరో చిన్న జిరాక్స్‌ మెషీన్ కొనుగోలు చేసి నకిలీ కరెన్సీని ముద్రించి మార్కెట్‌లో చెలామణి చేసేవారు. ఇదే సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో దానిని అనుకూలంగా మలచుకుని పెద్ద మొత్తంలో చిన్న నోట్లను ముద్రించారు.

వీటిని మార్కెట్‌లో చెలామణి చేసే విషయంలో అంజయ్య, సత్యనారాయణలతో చర్చించారు.అయితే అంజయ్యపై నిఘా వేసి ఉన్న రాచకొండ ఎస్‌వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నంలోని రమేశ్‌ ఇంటిపై దాడి చేసి ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కళ్యాణ్, శ్రీకాంత్‌ల కోసం గాలిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు