పోలేకుర్రులో కుటుంబం వెలి

1 Jul, 2017 23:29 IST|Sakshi
పోలేకుర్రులో కుటుంబం వెలి
ఎవరూ మాట్లాడరు.. ఉపాధి పనులకూ పిలవరు
ఎవరైనా మాట్లాడితే రూ.2 వేల జరిమానా  
స్థల వివాదం నేపథ్యంలో గ్రామ పెద్దల హుకుం 
సాంఘిక బహిష్కరణపై ఆర్‌ఐ విచారణ 
తాళ్లరేవు (ముమ్మిడివరం) : మండల పరిధిలోని పోలేకుర్రు పంచాయతీలో ఒక కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రెడ్డి గంగమ్మ అనే వృద్ధురాలు ఈ మేరకు కోరంగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గంగమ్మకు చెందిన ఖాళీ స్థలంలో గ్రామస్తులు గుడి నిర్మాణం ప్రారభించడంతో చెలరేగిన వివాదం వెలి (సాంఘిక బహిష్కరణ)కు దారితీసింది. ఈ నేపథ్యంలో గంగమ్మ కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు గ్రామానికి చెందిన పది మంది పెద్దలు స్థానికంగా ప్రచారం చేయడంతో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును నేరంగా పరిగణించి దీనిపై విచారణ చేయాలని మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌కు కేసును బదలాయించారు. ఈ మేరకు తహసీల్దార్‌ లోడా జోసెఫ్‌ విచారణ చేయాల్సిందిగా ఆర్‌ఐ కాకర్లపూడి కేశవ వర్మను ఆదేశించారు. ఆర్‌ఐ స్థానిక వీఆర్వో పి.ప్రకాశరావుతో కలిసి శనివారం విచారణ నిర్వహించారు. తన భర్త 18 ఏళ్ల క్రితం మృతి చెందారని, తనకు ఐదుగురు కుమారులు కాగా ముగ్గురు మృతి చెందారని, మరొకరు వికలాంగుడని గంగమ్మ తెలిపింది. అప్పటినుంచి తన పుట్టింటివారు ఇచ్చిన 25 సెంట్ల భూమిలో తాను, తన కుమారులు నివసిస్తున్నట్టు చెప్పింది. తమ స్థలంలో కొంతమంది గ్రామస్తులు అక్రమంగా స్తంభాలు పాతడంతో అడిగినందుకుగానూ తమ కుటుంబాన్ని వెలివేసినట్టు తెలిపింది. తమతో గ్రామస్తులెవరూ మాట్లాడవద్దని, కాదని మాట్లాడితే రూ.2 వేల జరిమానా చెల్లించాలని పెద్దలు హుకుం జారీచేసినట్టు తెలిపింది. అంతేకాకుండా తాగునీరు పట్టుకోకుండా, కిరాణా సరుకులు ఇవ్వకుండా, కనీసం ఉపాధి హామీ పనులకు సైతం పిలవకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తునట్టు ఆర్‌ఐకి మొరపెట్టుకుంది. పెద్దలు అంగీకరిస్తేనే పనుల్లోకి రానిస్తామని ఉపాధి సిబ్బంది చెప్పినట్టు గంగమ్మ కోడలు శ్రీలక్ష్మి తెలిపింది. మార్చి నెల నుంచి పనులకు పిలవకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన కుమార్తెను చదువు మానిపించి యానాంలో ఒక దుకాణంలో పనిచేయిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని శ్రీలక్ష్మి వాపోయింది. గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు సైతం తమను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం అధికారులను వేడుకుంటుంది. ఇలా ఉండగా తాము ఏ కుటుంబాన్ని వెలి వేయలేదని, వారి ఇంటిలో ఏ సమస్య వచ్చినా తామే వెళ్లి పరిష్కరిస్తామని పలువురు పెద్దలు చెప్పారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా