కుటుంబ సభ్యుల బలవన్మరణం

26 Mar, 2017 22:47 IST|Sakshi
కుటుంబ సభ్యుల బలవన్మరణం
– శ్రీమఠం వసతి గృహంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య
– పాండిచేరి వాసులుగా గుర్తింపు
– మృతుల కోరిక మేరకు మంత్రాలయంలో అంత్యక్రియలు 
 
మంత్రాలయం : పాపం ఏ కష్టం వచ్చిందో.. ప్రాంతంగాని ప్రాంతానికి వచ్చి ప్రాణాలు తీసుకున్నారు. తమకు ఎవరూ లేరని.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే తమ దేహాలకు అంత్యక్రియలు చేసి.. తమ ఆఖరి కోరికను తీరుస్తారని ఆశిస్తున్నామని మాతృభాష (తమిళంలో..) లేఖ రాసి మరీ బలవన్మరణం పొందారు. అన్నాచెల్లి.. చెల్లికూతురు కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన మంత్రాలయం శ్రీమఠం వసతి గృహంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు.. 
 
తమిళనాడు పాండిచ్చేరి నంబర్‌ 26, 5వ క్రాస్‌ వీధి, కవికుల్‌ నగర్, సారమ్‌కి చెందిన శరవణ్‌(42), చెల్లెలు శాంతి (28), చెల్లెలి కూతురు పవిత్ర (13) ఈనెల 21న మంగళవారం.. మంత్రాలయం వచ్చారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చామని శ్రీమఠం సెంట్రల్‌ రిసెప్సన్‌ సెంటర్‌లో మఠం రూమును బాడుగ తీసుకున్నారు. విజయేంద్ర వసతి గృహంలో 52 నెంబర్‌లో చేరారు. 22న, 23 తేదీల్లో రూము బాడుగను రెన్యూవల్‌ చేయించుకున్నారు.
 
24 తేదీ శుక్రవారం సాయంత్రం సమయంలోనూ వసతి గృహంలో పనిచేసే సిబ్బందికి కనిపించారు. ఆదివారం ఉదయం గది నుంచి విపరీతమైన వాసన రావడంతో అనుమానం వచ్చి సిబ్బంది.. మఠం సీఆర్వో ఐపీ నరసింహమూర్తి  తెలియజేశారు. అధికారుల సమాచారం మేరకు సీఐ నాగేశ్వరరావు అక్కడి చేరుకుని తలుపు గడిని పగలకొట్టించగా శరవణ్, శాంతి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని కనిపించారు. చిన్నారి పవిత్ర విగత జీవిగా కింద పడి ఉంది.  
 
ఇక్కడే అంత్యక్రియలు చేయండి..
పోలీసుల పరిశీలనలో తమిళంలో రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది. తాము అన్నాచెల్లెలు, చిన్నారి చెల్లెలి కూతురని.. ఆర్థిక ఇబ్బందులతో తాము చనిపోతున్నామని.. తమ దేహాలకు  పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు జరిపాలని.. ఇదే చివరి కోరికని.. తమిళం, ఆంగ్లం పదాలతో కూడిన సూసైడ్‌ నోట్‌ రాసినట్లు  పోలీసులు వివరించారు. మృతుడికి సెల్‌ఫోన్‌ ఉన్నా.. అందులో నంబర్లు లేకుండా  సిమ్‌కార్డును తొలగించారు. ఫొటో గ్యాలరీలోనూ ఏ ఆధారం లేకపోయింది. తీవ్ర మనోవేదనతోనే ఈ అఘయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కోరిక మేరకు అంత్యక్రియలు మంత్రాలయంలోనే నిర్వహించారు.
 
మరిన్ని వార్తలు