కాటేసిన కిడ్నీ

8 Jul, 2016 08:47 IST|Sakshi
కాటేసిన కిడ్నీ

* ముగ్గురు కుమారులతో కలసి తల్లి ఆత్మహత్య
* తల్లి ఒకరికి, తండ్రి మరొకరికి కిడ్నీలివ్వాలనుకున్నారు
* మూడో కొడుకును ఏం చేయాలనే మనోవేదన
* తనవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లడిల్లిన తల్లి
* తూర్పుగోదావరి జిల్లా అమరవిల్లిలో హృదయవిదారక ఘటన

పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా): ముగ్గురు కొడుకులకూ మూత్రపిండాలు పాడయ్యాయి. తండ్రి ఒకరికి, తల్లి మరొకరికి కిడ్నీలు ఇద్దామనుకున్నా.. మూడో కుమారుడికి ప్రాణాపాయం తప్పదు.

ఎవరినీ వదులుకోలేని నిస్సహాయ పరిస్థితి. పిల్లల మేనమామలు గతంలో కిడ్నీల వ్యాధితోనే మరణించారు. ఈ సమస్య వంశపారంపర్యంగా కొనసాగే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తనకు పుట్టినందునే పిల్లలు మహమ్మారి వ్యాధి బారినపడ్డారనే దోష భావన తల్లిని వెంటాడేది. బుధవారం రాత్రి కొడుకుల్ని బతికించుకోలేని నేనెందుకు బతకాలని కుమిలిపోయిన తండ్రిని భార్య, కుమారులు ఓదార్చారు. అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మెలకువ వచ్చిన తండ్రికి భార్య, ముగ్గురు పిల్లలు కన్పించలేదు. ఊరంతా గాలించాడు. ఫలితం లేదు.ఉదయాన్నే ఉప్పుటేరులో నాలుగు శవాలు తేలాయని తెలిసింది. అవి తన భార్య, పిల్లల శవాలేనని తెలిసిన తండ్రి గుండెలవిశేలా రోదిస్తూ కుప్పకూలిపోయాడు. ముగ్గురు కొడుకులతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక సంఘటనతో ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామానికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి (45) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. ఆ కుటుంబానికి రెండెకరాల పొలం ఉంది. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.

కొడుకులు ప్రభుప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18) ముగ్గురూ కొంతవరకు చదువుకున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రేమసాగర్ అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయూలని వైద్యులు చెప్పారు. కొడుకుకు కిడ్నీ ఇవ్వడానికి రాము సిద్ధమయ్యూడు. కొన్నాళ్ల క్రితం ప్రభుప్రకాష్, అనిల్‌కుమార్‌లు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేసిన వైద్యులు వారికీ  కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయించక తప్పదని చెప్పారు. దాంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆరోగ్యశ్రీలో డయూలసిస్‌కు తప్ప కిడ్నీల మార్పిడికి అవకాశం లేదు. ఉన్న ఆస్తిని తెగనమ్మి తండ్రి ఒకరికి, తల్లి ఒకరికి కిడ్నీలిచ్చి మార్పిడి చేరుుంచాలనుకున్నా ఎవరికి మార్పిడి చేయిం చాలి, ఎవరిని వదిలేయాలో తెలీని దుస్థితి వారిని తీవ్ర మనోవ్యథకు గురిచేసింది.
 
తండ్రిని ఓదార్చి తాము తనువు చాలించారు
ముగ్గురికీ డయూలసిస్ చేయిస్తున్నా పరిస్థితి క్రమేణా క్షీణించసాగింది. బుధవారం రాత్రి ఆవేదనతో విలపిస్తున్న రామును ఓదార్చిన భార్య, కుమారులు.. తాము మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు నాలుగు శవాలు కన్పించాయి. స్థానికులు అవి భూలక్ష్మి, ఆమె ముగ్గురు కొడుకులవిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా దొరకడం, నలుగురి మృతదేహాలూ తాడుతో కట్టి ఉండడంతో తల్లీకొడుకులు తొలుత పురుగుల మందు తాగి, తర్వాత తాడుతో కట్టుకుని ఉప్పుటేరులో దూకి ఉంటారని భావిస్తున్నారు. కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్‌రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు