మాఫీ మెలిక

2 Jul, 2016 08:52 IST|Sakshi


 వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఆదిలోనే ఎన్నో కొర్రీలు పెట్టింది. ఎందరో రైతుల పొట్టగొట్టింది. వడపోతల అనంతరం  మిగిలిన రైతులకైనా సజావుగా సొమ్ము చెల్లించడం లేదు. తాజాగా రెండో విడత మాఫీకి కొత్త మెలిక పెట్టింది. మాఫీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఉపశమన పత్రాలిస్తోంది. వాటిని బ్యాంకులో ఇస్తే సొమ్ము జమ అవుతుందని నమ్మబలికింది. తీరా బ్యాంకుకు వెళితే.. తమకెలాంటి ఆదేశాలు అందలేదని, సొమ్ము కూడా రాలేదని బ్యాంకర్లు చెబుతుండటంతో అన్నదాతలు అవాక్కవుతున్నారు. అడుగడుగునా తమను ఇబ్బందుల పాల్జేస్తున్న సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
 
 చింతలపూడి/జంగారెడ్డిగూడెం : ప్రభుత్వం ఇచ్చిన రుణ ఉపశమన పత్రం చూపిస్తున్న ఈయన పేరు ఘంటా చంద్రశేఖర్. చింతలపూడికి చెందిన ఈయన అక్కడి ఆంధ్రాబ్యాంక్ శాఖలో రూ.2 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. రూ.లక్షన్నర రుణం మాఫీ చేస్తున్నామని, ఆ మొత్తాన్ని 5 విడతలుగా చెల్లిస్తామని అధికారులు చెప్పారు. అప్పటివరకూ ఆగితే వడ్డీ పెరిగిపోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో బకాయిపడిన మొత్తం రుణాన్ని చెల్లించేశారు. గత ఏడాది మొదటి విడతలో రుణ మాఫీ సొమ్ము రూ.30 వేలు ఆయన బ్యాంక్ ఖాతాలో జమయ్యింది. రెండో విడత రుణమాఫీ నిమిత్తం రూ.30 వేలకు ఉపశమన పత్రాన్ని ఇటీవల అతనికి ఇచ్చారు.
 
  దానిని తీసుకుని బ్యాంకుకు వెళితే.. రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. సొమ్ము వచ్చినప్పుడు అకౌంట్‌లో వేస్తాం వెళ్లమన్నారు. ఈ మాత్రం దానికి రైతులకు ఉపశమన పత్రాలు ఎందుకు ఇవ్వాలని,  బ్యాంక్‌ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నామని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితి ఒక్క చంద్రశేఖర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రూ.లక్షకు పైబడి రుణం తీసుకుని.. రుణమాఫీ అర్హుల జాబితాలో చోటు సంపాదించుకున్న 3,35,456మంది రైతులు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీరందరికీ ఈ ఏడాది జనవరిలో రూ.262.32 కోట్లను చెల్లించాల్సి ఉండగా, తాపీగా ఇప్పుడు రుణ ఉపశమన పత్రాలు ఇస్తున్నారు.
 
 అవికూడా లబ్ధిదారుల్లో 50 శాతం మందికైనా అందలేదు. రూ.50 వేలలోపు రుణం తీసుకున్న వారిలో అర్హత ప్రాతిపదికన కొందరికి తొలి విడతలో రుణమాఫీ చేయగా, రూ.లక్ష దాటిన వారికి ఐదు విడతలుగా మాఫీ సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. రూ.లక్ష బకాయి ఉన్న రైతులకు విడతకు రూ.20వేల చొప్పున, రూ.1.50 లక్షలు బకాయి ఉన్నవారికి విడతకు రూ.30వేల చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. అంతకుమించి రుణాలు తీసుకున్న వారికి అత్యధికంగా రూ.1.50 లక్షలను మాత్రమే విడతల ప్రాతిపదికన చెల్లిస్తామని అభయమిచ్చింది.
 
 అడుగడుగునా అవాంతరాలే
 అధికారంలోకి వ స్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు.. రైతులకు అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. తాము తీసుకున్న మొత్తాన్ని మాఫీ చేస్తారని ఎదురుచూసిన రైతులకు రూ.లక్షన్నర మాత్రమే రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి షాకిచ్చారు. పోనీ అదైనా ఒకేసారి చేశారా అంటే ఐదు విడతలుగా ఇస్తానని ప్రకటించడంతో రైతులు కంగుతిన్నారు. మొదటి విడత మాఫీ సొమ్ము రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వానికి ఏడాది పట్టింది.
 
 పోనీ.. రెండో విడత సొమ్ము అయినా సకాలంలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాల వల్ల ఉపయోగం లేకుండా పోతోందని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రు లు, అధికారులు అట్టహాసంగా బహిరంగ సభలు పెట్టి పత్రాలు పంపిణీ చేస్తున్నా.. బ్యాంకర్లు తమకు ఇంకా సొమ్ము రాలేదనిఅంటుండటంతో వాటిని పొందిన అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో రుణమాఫీ సొమ్ము వస్తే ఎరువులు, విత్తనాలు తెచ్చుకుందామని ఆశపడుతున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. బ్యాంకుల్లో డబ్బు జమ చేయకుండా తమకు రుణ ఉపశమన పత్రాలు ఇవ్వడమెందుకని రైతులు నిలదీ స్తున్నారు. అసలు అప్పు రద్దవుతుందా లేదా అని గగ్గోలు పెడుతున్నారు.
 
 ఖాతాల్లో జమ చేయాల్సిందిలా..
 రుణ ఉపశమన పత్రాలు అందుకున్న రైతులు వాటిని బ్యాంకుకు తీసుకువెళ్లాలి. అక్కడ రైతు ఆధార్ నంబర్, రుణపత్రాన్ని తీసుకుని బ్యాంకు అధికారులు పరిశీలించి రుణ ఉపశమన పత్రంపై సంతకం చేసి తిరిగి రైతుకు ఇచ్చేయాలి. అనంతరం దానిని ఆన్‌లైన్ చేయాలి. ఇలా రైతుల పత్రాలన్నీ ఆన్‌లైన్ చేస్తే ఆ వివరాలన్నీ రైతు సాధికార సంస్థకు వెళతాయి. అక్కడి నుంచి ఏ బ్యాంకుకు ఎంత నగదు జమ చేయాలో చూసి ఆ సంస్థ తదుపరి చర్యలు చేపడుతుంది. అలా వచ్చిన నగదును ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు ఆ సొమ్మును ఖాతాల్లో నిల్వ ఉంచుకుంటే 10 శాతం వడ్డీ కూడా చెల్లించాలి.

>
మరిన్ని వార్తలు