నత్తనడకన..

30 Apr, 2017 21:13 IST|Sakshi
నత్తనడకన..

- జిల్లాకు మంజూరైనవి 2,922..
- పూర్తయినవి 133 మాత్రమే
- సేద్యపు కుంటలతో లాభాలెన్నో
- అవగాహన కల్పించని అధికారులు
- ముందుకు రాని రైతులు


ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): వర్షాధారిత పంటలు సాగు చేయడమంటే రైతు నష్టాలను మూట గట్టుకోవడమే. సరైన సమయంలో వర్షాలు లేక వేసిన పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడేలా రైతు జల నిధుల (ఫాం పాండ్స్‌)ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మన జిల్లాలో అధికారుల ప్రచార లోపం కారణం వల్ల నిర్దేశిత లక్ష్యం నెరవేరలేదు.

జలనిధి అవశ్యకతను రైతులకు అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా పల్లపు ప్రాంతాలలో ప్రవహించి వృథాగా బయటలకు పోతుంది. వాటిని ఒడిసిపట్టుకుంటే అవసరమైన సమయాల్లో పంటలకు నీటిని అందించవచ్చనేది జలనిధి (ఫాం పాండ్స్‌) ముఖ్య ఉద్దేశం. ప్రతికూలతలను అధిగమించి పంటకు అవసరమైన సమయంలో నీరందించే జల నిధుల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి.

జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి 19 మండలాల్లో 394 గ్రామ పంచాయతీల పరిధిలో 2922 ఫాం పాండ్స్‌ మంజూరయ్యాయి. అయితే, ఇప్పటివరకు పూర్తయిన వాటి సంఖ్య 133 మాత్రమే. పూర్తయిన ఫాం పాండ్స్‌ నిర్మాణాలకు రూ.71.32 లక్షలు ఖర్చు చేయగా, ఇంకా క్షేత్ర స్థాయిలో 209 ఫాం పాండ్స్‌ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటికి ఇప్పటివరకు రూ.16.03 లక్షలు ఖర్చు చేశారు. వేల్పూర్‌ మండలంలో అత్యధికంగా 93 నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక, భీమ్‌గల్‌ మండలంలో అత్యధికంగా 373 ఫాం పాండ్స్‌కు గాను రెండు మాత్రమే పూర్తయ్యాయి.

అవగాహన కల్పించడంలో విఫలం..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న నీతిఅయోగ్‌ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టడానికి రైతులకు ఉపయోగపడే పనులను నిరుడు ప్రారంభించింది. చెక్‌ డ్యాంల నిర్మాణం, బావుల తవ్వకం, వర్మి కంపోస్టు తయారీ, వరద కట్టల ఏర్పాటు, ఇంకుడు గుంతలతో పాటు రైతు జల నిధుల నిర్మాణాలను వేగవంతం చేసింది. కానీ మన జిల్లాలో రైతులకు ఉపయోగపడే పనులు వేగిరం కావడం లేదు. రైతుజల నిధుల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు.

చిన్న, సన్న కారు రైతులకు కూడా తగినంత భూమి అందుబాటులో లేక జలనిధులను నిర్మించుకోవడానికి మందుకు రావడం లేదు. రైతు జల నిధుల వల్ల కలిగే దీర్ఘకాలిక లాభాలను రైతులకు వివరిస్తే నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. భూములలో పల్లపు ప్రాంతాల్లో జలనిధి నిర్మించుకోవడం వల్ల చుట్టు పక్కల ప్రవహించే నీరు ఎలా దానిలో చేరుతుందో పశువులకు, పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అధికారులు విడమరిచి చెప్పితే రైతులు చైతన్యవంతులయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు