విద్యుదాఘాతంతో యువరైతు మృతి

12 Sep, 2017 23:20 IST|Sakshi
విద్యుదాఘాతంతో యువరైతు మృతి

విద్యుత్‌ మోటారు ఆడటం లేదని స్తంభమెక్కి మరమ్మతులు చేస్తున్న యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. తమ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని చిన్నారులు బిత్తరచూపులు చూస్తూ ఉండటం అందరి హృదయాలనూ కలచివేసింది. అమడగూరు మండలం బావాచిగాని కొత్తపల్లి (బి.కొత్తపల్లి)లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

అమడగూరు: బి.కొత్తపల్లికి చెందిన లేట్‌ కదిరిరెడ్డి, ప్రభావతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మంజునాథరెడ్డి (32)కి ఏడేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బిళ్లూరోళ్లపల్లికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మంజునాథరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో టమాట, ఎకరం విస్తీర్ణంలో సజ్జ సాగు చేశాడు. వారం రోజులుగా వ్యవసాయ బోరు మోటార్‌ పనిచేయడం లేదు.

దీంతో మంజునాథరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ బోరు దగ్గరకెళ్లి సర్వీస్‌ వైరును పరిశీలించాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేయబోయాడు. కొద్దిసేపటికే కరెంట్‌ రావడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. గంటసేపటి తర్వాత పశువుల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి సమీపంలోని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నాయకుల పరామర్శ
గత ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన ప్రభావతమ్మ కొడుకు ధనుంజయరెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు కడపల మోహన్‌రెడ్డి, నాయకులు దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు