గర్వంగా బతికేది రైతే

3 Dec, 2016 21:44 IST|Sakshi
గర్వంగా బతికేది రైతే
– భవిష్యత్తులో ఉద్యాన పంటలకే ప్రాధాన్యత
– 2020 నాటికి మహానందిలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు
– దేశంలో ఏపీ వ్యవసాయ విశ్వ విద్యాలయం నెంబర్‌ వ¯Œ
– ఆంగ్రో ద్వారా 410 వంగడాల సృష్టి
 
మహానంది: గర్వంగా చెప్పుకుని బతికేస్తున్న వృత్తులో రైతన్నది ప్రథమస్థానమని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు డైరెక్టర్‌, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రజతోత్సవ వేడుకల సందర్భంగా  నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చదివిన వారు సైతం తమ ఉద్యోగాలను వదిలి స్వగ్రామాలకు వస్తూ రైతులుగా మారుతుండటం రైతు గొప్పతనానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యానపంటలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తంగెడంచలో సీడ్‌హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ అనుభవాలకు తోడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుని మరింత ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. నంద్యాల పరిశోధనలు కీర్తివంతంగా ఉన్నాయన్నారు. కర్నూలు, నంద్యాల సోనాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు.  
దేశంలోనే నెంబర్‌ 1:
భారతదేశంలోని 72 వ్యవసాయ కళాశాలల్లో మన రాష్ట్రమే ఉన్నత స్థానంలో ఉందని, 825 మంది అధ్యాపకులతో భారతదేశంలో నెంబరువన్‌గా ఉందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ టి.రమేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సదస్సులో మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ఐదు వ్యవసాయ కళాశాలలు, రెండు వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలలు, రెండు ఫుడ్‌ సైన్సు అండ్‌ టెక్నాలజీ కళాశాలలు, 39 పరిశోధనా స్థానాలు, ఆరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ఒక గృహ విజ్ఞాన కళాశాల, 13 ఏరువాక కేంద్రాలు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు కలిగి విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 10,700 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అన్ని పంటలలో కలిపి 410 రకాల నూతన వంగడాలను సృష్టించినట్లు తెలిపారు. ప్రస్తుతం మహానందిలో ప్లాంట్‌ బ్రీడింగ్‌ మరియు అగ్రానమీ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టామన్నారు. 2020 నాటికి మహానంది కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. కార్యక్రమంలో విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్‌ వి.దామోదరనాయుడు, మేకల లక్ష్మినారాయణ, విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఎన్‌వీ నాయుడు, డీప్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ వీరరాఘవయ్య, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు.    
 
మరిన్ని వార్తలు