రైతు దారుణ హత్య

27 May, 2017 22:02 IST|Sakshi
రైతు దారుణ హత్య
పొలంలో నిద్రిస్తుండగా కత్తిపోట్లు
సంచలనం రేకెత్తించిన ఘటన
ఆలమూరు : ప్రశాంతమైన గ్రామంలో రైతు హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గొడవలకే ఆస్కారం లేని గ్రామంలో ఏకంగా ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా గ్రామస్తులు భావిస్తున్న రైతు చుండ్రు వీర్రాఘవులు (44) హత్యను చేధించేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆలమూరు పోలీసులు కథనం ప్రకారం మోదుకూరుకు చెందిన వీర్రాఘవులు తన పశువుల మకాం వద్ద రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని నిల్వ చేశాడు. యథావిధిగా గురువారం రాత్రి తన ధాన్యం రాశుల వద్ద పహారా నిర్వహించేందుకు సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరివెళ్లిపోయాడు. వేకువ జామున పశువుల పాలు తీసుకునేందుకు వెళ్లిన తండ్రి రాజుకు తన కుమారుడు వీర్రాఘవులు రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో తండ్రి రాజు వేస్తున్న కేకలను గమనించి పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై పి.దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు శరీరంలోని ఛాతీపైన, మెడపైనా రెండు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన విధానాన్ని బట్టి చూస్తే అత్యంత పాశవికంగా, కర్కశంగా, కసితోనే ఈ పని చేసినట్టు అర్థమవుతోంది. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మండపేట రూరల్‌ సీఐ వి.పుల్లారావుకు స్థానిక ఎస్సై దొరరాజు హత్యకు సంబంధించి సంఘటనా వివరాలను అందజేశారు. రైతు వీర్రాఘువులు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల లోపే హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో స్థానికుల ప్రమేయం ఉందా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వీర్రాఘవులను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ప్రతిష్టాత్మకంగా హత్య కేసు విచారణ
ఆలమూరు మండలంలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగని నేపథ్యంలో వీర్రాఘవులు హత్య కేసును త్వరితగతిన చేధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి సోదాలను నిర్వహించారు. లభించిన వివరాలు, స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన తీరు చూస్తూ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అభిప్రాయినిక పోలీసులు వచ్చారు.  
అనేక కోణాల్లో ..
హత్యకేసును చేధించేందుకు పోలీసులు అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఎవరైనా విరోదులు ఉన్నారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసుల దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది. పోలీసులకు ప్రస్తుతానికి ఏవిధమైన ఆధారాలు లభించలేదని విశ్వసనీయంగా తెలిసింది. మండపేట రూరల్‌ సీఐ పుల్లారావు కేసును దర్యాప్తు చేస్తుండగా ఎస్సై దొరరాజు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండపేట, అంగర, మండపేట రూరల్‌ ఎస్సైలు నసీరుల్లా, పెద్దిరాజు, సీహెచ్‌ విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు