అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

15 Apr, 2017 22:26 IST|Sakshi
అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

పత్తికొండ టౌన్‌: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పత్తికొండలో చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ తూర్పు హనుమంతు (60) శనివారం మధ్యాహ్నం పత్తికొండ గ్రామపంచాయతీ కూరగాయల మార్కెట్‌ ఆవరణలో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. కొందరు గమనించినప్పటికీ మద్యం తాగి పడి పడిపోయాడని భావించి దగ్గరకు రాలేదు. సాయంత్రానికి అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ షాజహాన్‌ అక్కడకు చేరుకుని విచారణ చేయగా మృతుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ తూర్పు హనుమంతుగా గుర్తించారు.

మృతుడికి భార్య గిడ్డమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నలుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఉన్న 5 ఎకరాల పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకోలేదు. వ్యవసాయానికి,  కుమారుడి ఆసుపత్రి ఖర్చులకు దాదాపు రూ. 6 లక్షలు అప్పు చేశాడు. అప్పులు పెరుగుతుండటంతో తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం పత్తికొండకు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పివచ్చాడు. పత్తికొండలో పురుగు మందు డబ్బాకొని, మార్కెట్‌ ఆవరణలో తాగి మృతి చెందాడు. రైతు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   
 

మరిన్ని వార్తలు