అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

11 Jul, 2017 23:38 IST|Sakshi
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
  • మృతునికి 8 మంది కూతుళ్లు
  • నలుగురికి పెళ్లి.. మరో నలుగురికి పెళ్లీడు
  • భారమైన అప్పులు.. ఆదుకోని రుణమాఫీ
  •  

    కదిరి:

    అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చలమకుంట్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళిత రైతు నాగప్ప(56) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో అప్పు చేసి బోరు వేయగా కరువుతో కొద్ది రోజులకే ఎండిపోయింది. అన్నదమ్ములతో కలిసి మరో బోరు వేయించాడు. ఇందుకోసం బంధువుల వద్ద అప్పు చేశాడు. కొద్దిగా నీరు పడటంతో వేరుశనగ సాగు చేస్తున్నాడు.

    ఇతనికి భార్య శివమ్మ, 8 మంది కుమార్తెలు సంతానం. పెద్దమ్మాయిలు ముగ్గురినీ టీటీసీ చదివించి అప్పులు చేసి పెళ్లిళ్లు కూడా చేశాడు. నాలుగో కుమార్తె చదువుకోలేదు. ఈమెకు కూడా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాడు. మిగిలిన నలుగురు కూతుళ్లూ పెళ్లీడుకొచ్చారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్‌ చదువుతుండగా.. మరో ఇద్దరు ఇంటర్‌ చదువుతున్నారు.

    చివరి అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. మూడెకరాల పొలంతో నాగప్ప బతుకు బండిని భారంగా లాగుతున్నాడు. పంటల సాగు, పెట్టుబడులతో పాటు పిల్లల చదువుకు బంధువుల వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. అదేవిధంగా కదిరి ఎస్‌బీఐ ఏడీబీలో భార్య బంగారం తాకట్టు పెట్టి 2014లో రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందులో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. అదే బ్యాంకులో 2013లో రూ.45వేలు పంట రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిపి అది రూ.60వేలకు చేరుకుంది. ఇందులో రూ.5వేలు మాత్రమే మాఫీ అయ్యింది. అది వడ్డీకే సరిపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

     

    అసలే అప్పులు.. ఆపై కుటుంబ భారం

    పంటల సాగుతో పాటు పిల్లల చదువు, పెళ్లిళ్లతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగప్పను కష్టాలు ఉక్కిరిబిక్కిరిచేశాయి. ఇక లాభం లేదని గురుపౌర్ణమి నాడు(9న) బోరుబావి దగ్గరకెళ్లి తన వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరి సారిగా తన భార్యాపిల్లలను చూడాలనిపించి పరుగు పరుగున ఇంటికెళ్లాడు.

    అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం లేదా కర్నూలుకు తరలించాలని సూచించారు. వారి సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మంగళవారం కన్నుమూశాడు. కదిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు