ఇదేందిరబ్బీ!

7 Jul, 2017 10:03 IST|Sakshi
ఇదేందిరబ్బీ!

► అన్నదాతకు అందని పంట డబ్బు  
► ధాన్యం కొనుగోలులో సర్కారు చిత్రం
► ఖరీఫ్‌ వచ్చినా.. సొమ్ములివ్వని వైనం
► జిల్లా వ్యాప్తంగా రూ.7కోట్ల బకాయిలు
► రైతుల ఆందోళన
► పట్టించుకోని అధికారులు


రబీ అయిపోయిది. ఖరీఫ్‌ ఆరంభమైంది. అన్నదాతలు నాట్ల దశకు చేరారు. అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా రబీ పంట డబ్బు అందలేదు. ఫలితంగా వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.  

ఏలూరు (మెట్రో) : ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఖాతాల్లో 48 గంటల్లో సొమ్మును జమ చేస్తాం. మద్దతు ధర అందేలా చూస్తాం.’ ఇదీ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా చెప్పిన మాట. ఆయన చెప్పినట్టు 48 గంటల్లో కాదు కదా.. మూడు నెలలు పూర్తయిపోయినా.. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చినా.. ఇంకా రబీ పంట డబ్బు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా సుమారు రూ.7కోట్ల 26 లక్షలు రైతులకు చెల్లించాలి.  

రబీలో కొనుగోలు ఇలా..
గత రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 283 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొన్నారు. 85,284 మంది రైతుల వద్ద నుంచి 10,18,449.88 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. అన్నదాతలకు 1,523.41 కోట్లు నిధులు చెల్లించాల్సి ఉండగా.. రూ.1,516.14కోట్లు చెల్లించారు. ఈ నిధులనూ 48గంటల్లో కాకుండా ధాన్యం కొన్న 10, 15 రోజులకు, ఒక్కో రైతుకు 30 రోజులకూ చెల్లింపులు చేశారు. ఇంకా రూ.7.26 కోట్లు  రైతులకు చెల్లించాల్సి ఉంది.

అన్నింటిలోనూ ముందు వరుసలోనే..
రబీ సీజన్‌లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ఈ జిల్లాలన్నింటిలో పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక మంది రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. అధిక నిధులు కూడా చెల్లించింది. అదే స్థాయిలో రైతులకు ఆలస్యంగా నిధులు చెల్లించిన జిల్లాగానూ, ఇంకా అత్యధికంగా సొమ్ములు బకాయి పడిన జిల్లా కూడా మనదే.

ఇబ్బందుల్లో రైతులు
జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి లేక సతమతమవుతున్నారు. రుణమాఫీ, ఇతరత్రా కారణాల వల్ల బ్యాంకులు అన్నదాతలకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రబీ పంట డబ్బులు వెంటనే చెల్లిస్తే తమకు కొంతలో కొంత ఉపశమనంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. తక్షణం డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు